‘సినిమా’ అనే మిషమీద తెరపై కనిపించడంలో ఎలాంటి వెర్రిమొర్రి వేషాలు వేసినా.. వాటి గురించి ప్రశ్నించడానికి వీల్లేదు. వాటిని కూడా అభ్యంతర పెట్టేవాళ్లు ఉంటారు, తెరమీద నటనే అయినా సరే, మంచిని మాత్రమే ప్రేక్షకులకు అందించాలని కోరుకునే వాళ్లుంటారు. కానీ తెరమీద లేకి వేషాలను నటుడికి ఆపాదించకుండా పాత్రకు, ఆ కథకు సంబంధించి పాత్ర ఔచిత్యానికి అవసరం అని సరిపెట్టుకోవచ్చు. కానీ బాహ్యప్రపంచంలో వ్యక్తిగా కనిపించేటప్పుడు తమ రేంజి ఏమిటో, స్థాయి ఏమిటో సెలబ్రిటీలు గుర్తుంచుకోవాలి. కానీ నందమూరి బాలయ్య బాబు తన రేంజి మరచిపోయి.. లేకిపనులతో వార్తల్లో నిలుస్తుండడమే ఆయన తీరు మీద జాలిగొలుపుతోంది.
సంక్రాంతి సినిమాల సక్సెస్‌లో బాలయ్య బాబు చేసిన వీరసింహారెడ్డి ఏ స్థానంలో ఉందో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఇంకా గణాంకాలు తేలలేదు. టాప్ పొజిషన్ కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ అందరికంటె ముందుగా వీరసింహారెడ్డికి చాలా ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించుకున్నారు. ఇవాళ్టి రోజుల్లో సక్సెస్ లకు సక్సెస్ మీట్ లకు సంబంధం లేదు. పైగా సినిమా బ్యాడ్ కూడా కాదు. బాలయ్య అభిమానులకు విందు చేస్తోంది. ఇదంతా ఓకే. కానీ సక్సెస్ మీట్ తర్వాత ఆఫ్టర్ అవర్స్ పార్టీలో వ్యవహారాలే లేకిగా తయారయ్యాయి.
ప్రెవేటు జీవితాల్లోకి తొంగి చూడకూడదన్నది ఒక నైతిక నియమం, నిజమే! కానీ ఇది ప్రెవేటు వ్యవహారం కాదు. పబ్లిగ్గానే జరిగిన ఆఫ్టర్ అవర్స్ పార్టీ! ఈ పార్టీలో బాలయ్య బాబు తనతో ఒక హీరోయిన్ గా చేసిన మళయాళ నటి హనీ రాజ్ తో కలిసి.. ఇలా చేతుల్లో చేతులు పెనవేసి.. లిక్కర్ సేవిస్తూ దిగిన దృశ్యం ఇది. ఇంత బహిరంగంగా తమ బంధాన్ని పెనవేసుకోవడం అవసరమా? అనేది ప్రజల్లో మెదలుతున్న సందేహం.
బాలయ్య బాబు అంటే.. ఏదో మామూలు సినిమా నటుడు కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే. లక్షల మంది ప్రజలకు ప్రజాప్రతినిధి. ఫ్యాన్స్ పరంగానో, కులం పరంగానో చూస్తే ఇంకా చాలా లక్షల మందికి ఆయన దేవుడు. ఆయన మాట, ప్రవర్తన అన్నీ కూడా ఆయనను ఆరాధించేవారికి ఆదర్శంగా ఉండాలి. ఆయనను చూసి, అభిమానించే వారు ఏదైనా నేర్చుకునేలా ఉండాలి. కానీ.. ఇదేమిటి, మరీ ఇంత లేకిగా!
బాలయ్య బాబు వేదిక ఎక్కితే చాలు.. ‘తెలుగుజాతికి రాముడు, కృష్ణుడు, దేవుడు, జాతి మొత్తానికి అన్న అయిన మహానుభావుడు నందమూరి తారక రామారావు..’ అంటూ తన తండ్రి ప్రస్తావన ప్రతిసారీ తప్పకుండా తెస్తారు. అలాంటి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడికి తర్వాతి తరం నటవారసుడిగా చెలామణీ అవుతున్న ఏకైక హీరో బాలయ్య!.
కేవలం ఆయన వారసుడిగా నటుడిగా ఉండడం మాత్రమే కాదు.. ఆయన పాటించిన నైతికవిలువలను, సంస్కారాలను వారసుడిగా పాటించడం బాలయ్య బాబుకు ఉన్న బాధ్యత. ఆయన గౌరవాన్ని కాపాడడం ఆయన కర్తవ్యం. ఫోటోలకు దొరకకుండా ఉండే ప్రెవేటు వ్యవహారాల వరకు ఎలా ఉన్నా పరవాలేదు గానీ.. ఇలాంటి దృశ్యాలతో ఫోటోలకు చిక్కితేనే అన్నగారిని అభిమానించే వారికి, బాలయ్యను నటసింహంగా, నాయకుడిగా ఆరాధించేవారికి మనస్సు చివుక్కుమంటుంది.