ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి వైఎస్ జగన్‌ను గద్దె దించడంతో పవన్‌కల్యాణ్ సంతృప్తి పడొచ్చు. కానీ కాపులు మాత్రం దాంతో సంతృప్తి చెందేలా లేరు. వారి డిమాండ్ ఎంత బలంగా ఉందో మాజీ మంత్రి హరిరామ జోగయ్య తాజాగా రాసిన బహిరంగ లేఖే నిదర్శనం. టీడీపీతో పొత్తు కోసం జనసేన వెంపర్లాడడం వెనుక వారి అసలు ఉద్దేశాన్ని హరిరామ జోగయ్య బయట పెట్టారనే చర్చకు తెరలేచింది.
రాష్ట్ర ప్రజలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖలోని వివరాలేంటో తెలుసుకుందాం.
“వైసీపీని ఓడించాలంటే జనసేన-టీడీపీ పొత్తు వుండాల్సిందే. ఇదే కాపు సంక్షేమ సేన ఆకాంక్ష. అయితే ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ ఉండాల్సిందే… ఇదే కాపు సంక్షేమ సేన డిమాండ్. రాక్షస పాలన, అభివృద్ధి రహిత పాలన, అవినీతి పాలన సాగిస్తున్న వైసీపీ అధినేతను రానున్న ఎన్నికల్లో ఓడించడమే కాదు, జనసేన లక్ష్యం పవన్‌కల్యాణ్‌ని ముఖ్యమంత్రి చేయడం ద్వారా బడుగు, బలహీన వర్గాల రాజ్యం ఏర్పాటు చేయడమే కాపు సంక్షేమ సేన ముఖ్య ఆశయం “
చేగొండి హరిరామజోగయ్య కాపు సంక్షేమ సేనకు వ్యవస్థాపక అధ్యక్షుడు కావడం గమనార్హం. చంద్రబాబునాయుడిని సీఎంగా కాపులు మాత్రం అంగీకరించడం లేదనేందుకు హరిరామజోగయ్య బహిరంగ లేఖ నిదర్శనమనే చర్చకు తెరలేచింది. జగన్‌పై అక్కసుతో చంద్రబాబును సీఎం సీట్లో కూచోపెట్టడానికి తనతో పాటు కాపులందరినీ పల్లకీ మోయమంటే, అందుకు వారు సిద్ధంగా లేరని చెప్పొచ్చు. అధికారంలో కాపులు వాటాను డిమాండ్ చేస్తున్నారు.
అది కూడా సీఎం పదవిని పవన్‌కు ప్రకటించాలని డిమాండ్ చేయడం టీడీపీకి తలనొప్పే. పవన్‌కు ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి కాపుల ఓట్లు టీడీపీకి వేయడం, వేయకపోవడం వుంటుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు నైజం తెలిసిన వాళ్లెవరైనా పవన్‌కు సీఎం పదవిలో వాటా ఇస్తారంటే నమ్మరు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఆధారపడి వుంటుంది.