మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మాటలు బలం కలిగిస్తున్నాయి. కడప జిల్లాలోని సీనియర్ నాయకులంతా త్వరలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు వీరశివారెడ్డి మీడియాకు చెప్పారు. వారిలో ఆదినారాయణరెడ్డి కూడా ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి వైఖరిపై వైఎస్సార్ కడప జిల్లాలో చర్చ జరుగుతోంది.
2014లో వైసీపీ తరపున జమ్మలమడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి…. జగన్‌ను విభేదించి టీడీపీలో చేరారు. మంత్రి పదవి దక్కించుకున్నారు. అసెంబ్లీ వేదికగా జగన్‌ను తీవ్రస్థాయిలో దూషించారు. 2019లో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆదినారాయణరెడ్డికి భయం పట్టుకుంది.
జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతారని ఆయన బీజేపీని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో రాష్ట్ర నాయకుడు. ఒక దశలో ఏపీ బీజేపీ అధ్యక్ష స్థానానికి ఆయన పోటీ పడ్డారు. కానీ దక్కలేదు. మరో 15 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఆదినారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటనే చర్చకు తెరలేచింది. ఆది అన్న నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జ్. రానున్న ఎన్నికల్లో ఇతనే బరిలో వుంటారనే చర్చ జరుగుతోంది. దీంతో అన్న కుమారుడిని గెలిపించుకునేందుకు ఆదినారాయణరెడ్డి అన్నదమ్ములంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలున్నాయి.
టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే బాగుంటుందని ఆదినారాయణరెడ్డి ఆకాంక్ష. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఆదినారాయణరెడ్డి పక్క చూపులు చూస్తున్నారు. మళ్లీ టీడీపీ పంచన చేరడానికి ఆయన ఆసక్తి కనబరుస్తు న్నారని సమాచారం. వైఎస్సార్ కడప జిల్లాలోని సీనియర్ నేతలు వరదరాజులరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలతో కలిసి ఆదినారాయణరెడ్డి కూడా చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించడానికి సిద్ధమయ్యారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
జమ్మలమడుగులో అన్న కుమారుడి విజయానికి పని చేసేందుకు ఆది రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీతో అవసరం తీరడంతోనే ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళుతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.