అవును. అధికారం అన్నది ఎవరికైనా కావాల్సిందే. ఏదో వచ్చాం కదా అయిదేళ్ళూ ఎమ్మెల్యేగా పనిచేసి వెళ్లిపోదామనుకుంటే కుదిరే రోజులా. పైగా ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రులను ఓడించి చట్ట సభలోకి వచ్చారు. ప్రభుత్వ విప్ గా చేశారు.
ఆయన ఎవరో కాదు బొబ్బిలి రాజులను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు. ఆయనకు సౌమ్యుడు, వివాదరహితుడు అని పేరు. ప్రజలకు ఎపుడూ చేరువగా ఉంటూ వారి బాగోగులు చూసుకుంటే తన పనేదో తాను చేసుకునే రకం.
నిజానికి వైసీపీ టికెట్ మీద గెలిచి టీడీపీలో జంప్ చేసి మంత్రి అయిన సుజయ క్రిష్ణ రంగారావుని ఓడించాలని 2019 ఎన్నికల్లో గట్టిగా డిసైడ్ అయింది. మరి ఆయన్ని మాజీని చేసి మరీ శంబంగి అధినాయకత్వం ఆశను తీర్చారు. ఒక విధంగా మొదటి దఫాలోనే ఆయనకు మంత్రి పదవి రావాలని అంతా కోరుకున్నారు.
ఇపుడు చూస్తే తాను కూడా రేసులో ఉన్నానని సంకేతాలు ఇస్తున్నారు. ఆయన అనుచరులు అయితే బొబ్బిలి కోటలో పులి లాంటి శంబంగి కాబోయే మంత్రి అంటూ సౌండ్ చేస్తున్నారు. బలమైన వెలమ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత శంబంగి ఆశలను జగన్ తీరుస్తారా లేదా అన్నది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.