ఏపీలో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీల, మేజర్ పంచాయతీల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తూ ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని కుప్పం మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం దిశగా దూసుకుపోతోంది. టీడీపీ అక్కడ కనీస పోటీ కూడా ఇవ్వలేని వైనం కౌంటింగ్ లో బయటపడుతూ ఉంది.
ఆ సంగతలా ఉంటే.. ఈ సారి ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని ఫలితం వస్తోంది ప్రకాశం జిల్లా దర్శి నుంచి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో నెగ్గిన నియోజకవర్గం దర్శి. ఇటీవలే ప్రకాశం జిల్లా జడ్పీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన మైన విజయంతో సొంతం చేసుకుంది. అయితే మున్సిపాలిటీ మాత్రం తెలుగుదేశం పార్టీ వశం అవుతోంది.
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు, ఎమ్మెల్యే కేరాఫ్ బెంగళూరు అన్నట్టుగా వ్యవహరించడం వంటి వ్యవహారాలు దెబ్బ కొట్టాయని సమాచారం. అలాగే ఈ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం జనరల్ కు వచ్చింది. అయితే కాపు అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ క్యాండిడేట్ గా ప్రకటించింది. స్థానిక ఓట్ల లెక్కలకు భిన్నంగా వ్యవహరించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
అలాగే దర్శి ఎమ్మెల్యే పై ఆదిలోనే వ్యతిరేకత ప్రబలింది. రియలెస్టేట్ వ్యాపారుల నుంచి కూడా ఎమ్మెల్యే కమిషన్లు వసూలు చేస్తారనే టాక్ ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే వర్గాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రచారానికి కూడా వారిని పట్టించుకోలేదని సమాచారం. పోలీసుల బదిలీల వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే సోదరుడు వసూళ్ల పర్వం సాగిందనే ప్రచారం ఉంది. ఒక పోలీసాధికారి బదిలీ వ్యవహారంలో ఒక ఖరీదైన కారు గిఫ్ట్ నడిచిందనే మాట రెండేళ్ల కిందటే స్థానికంగా వినిపించింది.
ప్రతి దాంట్లోనూ వసూళ్ల పర్వం ఉందని, ఎమ్మెల్యే సోదరులే స్థానికంగా ఎమ్మెల్యేలుగా చలామణి అవుతారని, దీనికి తోడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిలిచే సామాజికవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, వారిని తన మాటలతో నొప్పించడానికి కూడా వెనుకాడకపోవడం వంటి వాటి వల్ల కూడా.. దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఈ ప్రతిఫలం దక్కడానికి కారణం అని తెలుస్తోంది. కుప్పంలో ఓటమితో కుదేలైన దశలో ఉన్న టీడీపీకి దర్శి వంటి చోట ఎమ్మెల్యే తీరు ఆక్సిజన్ అందించినట్టుగా ఉంది.