కుప్పంలో కుప్ప‌కూలిన టీడీపీ!

అనుకున్నాంతా అయిన‌ట్టుగా ఉంది! తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌కవ‌ర్గం ప‌రిధిలోని కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి టీడీపీ రెండంటే…

అనుకున్నాంతా అయిన‌ట్టుగా ఉంది! తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌కవ‌ర్గం ప‌రిధిలోని కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి టీడీపీ రెండంటే రెండు వార్డుల్లో మాత్ర‌మే గెలుపును సాధించిందంటే అక్క‌డ ప‌చ్చ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 14 వార్డుల్లో ఘ‌న విజ‌యం సాధించి, చైర్మ‌న్ సీటును సొంతం చేసుకుంటోంది. రెండో రౌండ్ కౌంటింగ్ లో తొమ్మిది వార్డుల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. అయితే వాటి ఫ‌లితాల‌తో నిమిత్తం లేకుండా కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోనుంది. 

రెండో రౌండ్ లో అయినా టీడీపీ క‌నీస పోటీ ఇవ్వ‌క‌పోతే.. ఆ పార్టీది మ‌రింత ఫెయిల్యూర్ స్టోరీ అవుతుంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించింది. ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందు చంద్ర‌బాబు నాయుడు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టారు. ఆ త‌ర్వాత బోలెడంత మంది ఇన్ చార్జిలు అక్క‌డ టీడీపీ గెలుపు కోసం ప్ర‌య‌త్నాలు సాగించారు.

స్వ‌యంగా లోకేష్ కూడా ప్ర‌చారానికి వెళ్లారు. చంద్ర‌బాబు దేవుడ‌ని, అది త‌మ దేవుడి నియోజ‌క‌వ‌ర్గం అంటూ.. సెంటిమెంట్లు రేకెత్తించ ప్ర‌య‌త్నం చేశారు లోకేష్. అయితే ఆ పాచిక‌లు ఏవీ పార‌లేద‌ని ఫ‌లితాల‌తో స్ప‌ష్ట‌త వ‌స్తోంది.

కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడింది. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా చంద్ర‌బాబు నాయుడు కుప్పం వెళ్లారు. అప్ప‌ట్లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ అభ్య‌ర్థుల‌ను ప‌రిచ‌యం చేసి.. వారిని గెలిపించాల‌ని కోరారు. అయితే ఆ త‌ర్వాత టీడీపీ బ‌హిష్క‌ర‌ణ అంటూ కొత్త డ్రామాకు తెర తీసింది. అయితే టీడీపీ అభ్య‌ర్థులు పోటీలో అయితే నిలిచారు. చిత్త‌య్యారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.

అది కూడా భారీ మెజారిటీలు, టీడీపీ నాలుగైదు వార్డుల్లో అయినా గెల‌వ‌డం క‌ష్టం లాగుంది. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం చంద్ర‌బాబు చాలా ప్ర‌య‌త్నాలే సాగించారు. రోజుకు మూడు సార్లు జూమ్ మీటింగులు పెట్టి, పార్టీ గెలుపు కోసం అన్ని అస్త్ర‌శ‌స్త్రాల‌నూ సంధింప‌జేశారు. అయితే ఏ ఒక్క‌టీ ఫ‌లితాన్ని ఇచ్చిన‌ట్టుగా లేదు!