జాతీయ పౌరపట్టిక.. ఎన్ఆర్సీ అనేది అసోంలో ఎంత రభస సృష్టించిందో అందరికీ తెలుసు. అక్కడ ఎన్ఆర్సీలో పేర్లు లేకుండా పోయిన 19లక్షల మంది ప్రజల భవితవ్యం ఏమిటనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. బిక్కుబిక్కుమంటూ జీవితాలు గడపాల్సి వస్తోంది.
తాము ఈదేశానికే చెందుతామని నిరూపించుకోవడానికి వారు ఇప్పుడు కోర్టు లను ఆశ్రయించాల్సిన ఖర్మం ఏర్పడుతోంది. ఆ వ్యవహారంమీదనే దేశవ్యాప్తంగా భిన్న వర్గాలనుంచి నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయినప్పటికీ.. కేంద్రప్రభుత్వం మాత్రం.. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేయాలనే కృతనిశ్చయంతోనే ఉంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేనేలేదని హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వెల్లడించడం ఇప్పుడు కొందరిలో భయాన్ని కూడా రేకెత్తిస్తోంది.
ప్రస్తుతానికి అధికారికంగా ఒక్క పశ్చిమబెంగాల్ మాత్రం ఎన్ఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నేను ముఖ్యమంత్రిగా ఉండగా.. పశ్చిమబెంగాల్ లో దానిని అనుమతించేదే లేదని మమత తెగేసి చెబుతున్నారు.
నిజానికి ఈ ఎన్ఆర్సీ ద్వారా ఎలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కేంద్రం అనుకుంటున్నదో.. ఎలాంటి చొరబాటు దార్లని ఏరివేయాలని భావిస్తున్నదో అలాంటి బెడద అధికంగా ఉన్నది ఆ రాష్ట్రానికే. కానీ అక్కడ మమత మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మిగిలిన దేశంలో ఎక్కడా ప్రభుత్వాలనుంచి ఇంత వ్యతిరేకత లేదు గానీ, వివిధ వర్గాల వారిలో నిరసన ఉంది. అయితే ఎన్ఆర్సీ విషయంలో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో భాజపాయేతర ప్రభుత్వమే అయినా, దీనిని వ్యతిరేకించే స్థితిలో జగన్ సర్కారు లేదు. వారికి ఉన్న బెడద కూడా పెద్దగాలేదు. వ్యక్తులు నిరసించినప్పటికీ.. ఆ రాష్ట్రంలో ఎన్ఆర్సీలోకి ఎంటర్ కాకుండా మిగిలిపోయే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉండొచ్చు.
కానీ తెలంగాణ పరిస్థితి అలా కాదు. ఇక్కడ పెదసంఖ్యలో ఉన్న ముస్లిం సమాజం, మజ్లిస్ పార్టీ కూడా ఎన్ఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింలను అభద్రతకు గురిచేయడానికే ఈ ఎన్ఆర్సీ అనే కుట్రను కేంద్రం తెరమీదకు తెస్తున్నట్లుగా కూడా ఆరోపణలున్నాయి. మరి ఎన్ఆర్సీ దేశమంతా అమలు చేయడం అనేది ఈ రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచిచూడాలి.