తెలుగు పోరాటాల దిశ మారాలి!

వచ్చే విద్యాసంవత్సరం నుంచి…  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ 1నుంచి 6 తరగతుల వరకు తెలుగుమీడియం ను తొలగించి, ఇంగ్లిషు మీడియంను మాత్రమే ప్రవేశ పెట్టాలనే విషయంలో ప్రభుత్వం విధివిధానాలను కూడా రూపొందించేసింది. Advertisement ఫైనల్…

వచ్చే విద్యాసంవత్సరం నుంచి…  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ 1నుంచి 6 తరగతుల వరకు తెలుగుమీడియం ను తొలగించి, ఇంగ్లిషు మీడియంను మాత్రమే ప్రవేశ పెట్టాలనే విషయంలో ప్రభుత్వం విధివిధానాలను కూడా రూపొందించేసింది.

ఫైనల్ డెసిషన్ కూడా అయిపోయినట్లే. నిన్నటికి నిన్న వైకాపాకు చెందిన ఒక ఎంపీ లోక్‌సభలో మాట్లాడిన మాటలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయని ‘అనిపించినందుకు’ ముఖ్యమంత్రి జగన్ ఫైరయినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక ఈ నిర్ణయంలో ఏమాత్రం మార్పు చేర్పులు ఉండవనేది ఖరారు. తెలుగు మీడియం ఉండాల్సిందే అని గానీ… ఇంగ్లిషు మీడియం వద్దు అనిగానీ పోరాటాలు చేస్తున్న వారంతా.. తమ పోరాటాల దిశ మార్చుకుంటే.. అంతో ఇంతో భాష బతికి బట్ట కడుతుంది.

జగన్మోహనరెడ్డి నిర్ణయంలో మంచిచెడుల గురించి తర్కించడం అనవసరం. ప్రజలు అధికారం ఇచ్చారు.. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈ నిర్ణయం ద్వారా ప్రజలందరికీ పేదలందరికీ మేలు జరుగుతుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే విమర్శలను ఖాతరు చేయకుండా అమలులో పెట్టి తీరాల్సిందేనని డిసైడయ్యారు. ఇక దాని మీద పంచాయతీలు పెట్టడం కంటె.. ఎలాంటి చర్యల ద్వారా ఈ విధానం వలన తెలుగు భాష చచ్చిపోకుండా ఉంటుందో తెలుగు ఉద్యమకారులు ఆలోచిస్తే బాగుంటుంది.

ఇంగ్లిషు మీడియం ఉన్నంత మాత్రాన తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే ఒక సబ్జెక్టుగా ఉన్నంత మాత్రాన.. ఆ సబ్జెక్టు మీద ప్రతి విద్యార్థికీ సమగ్రమైన పట్టు వస్తుందని అనుకోవడం భ్రమ. అలాగని భాష మీద పట్టు లేకుండా పోయినట్లయితే.. జరిగే నష్టం కూడా తక్కువదేమీ కాదు.

అందుకే ఇంగ్లిషు మీడియం ఉంటుండగానే.. తెలుగును ఒక సబ్జెక్టుగా పెట్టడంలో ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తున్నదానికంటె మెరుగైన చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలని భాషా ఉద్యమకారులు తయారు చేయాలి. సానుకూల దృక్పథంతో ప్రభుత్వానికి నివేదించి.. తదనుగుణమైన నిర్ణయాలు వచ్చేలా చేయాలి. అలా చేస్తే భాషను కాపాడుకోవడం అనేది సాధ్యమవుతుంది.