ఏహే…ఆయ‌న బ‌ల‌మైన నాయ‌కుడేంటి?

ఖ‌మ్మం జిల్లా పాలేరు వార్త‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంగా నిలిచింది. అక్క‌డి నుంచి వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల బ‌రిలో వుంటాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌లో ష‌ర్మిల పార్టీ విలీనం అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో…

ఖ‌మ్మం జిల్లా పాలేరు వార్త‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంగా నిలిచింది. అక్క‌డి నుంచి వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల బ‌రిలో వుంటాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌లో ష‌ర్మిల పార్టీ విలీనం అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె ఎక్క‌డి నుంచి బ‌రిలో వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. మ‌రోవైపు బీఆర్ఎస్‌లో త‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని ఆశించిన మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు… చివ‌రికి భంగ‌ప‌డ్డారు.

తుమ్మ‌ల‌పై కాంగ్రెస్ త‌ర‌పున గెలిచి, ఆ త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. దీంతో తుమ్మ‌ల తీవ్ర నిరాశ‌న‌కు గుర‌య్యారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఆయ‌న అన్వేషిస్తున్నారు. హైద‌రాబాద్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కూ భారీ ర్యాలీ నిర్వ‌హించి బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేశారు. కాంగ్రెస్‌లో చేరి పాలేరు నుంచి పోటీ చేయాల‌ని తుమ్మ‌ల‌పై ఆయ‌న వ‌ర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు.

తుమ్మ‌ల‌ను టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి త‌దిత‌ర నేత‌లు క‌లిసి పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మ‌ల కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా వుండ‌గా తుమ్మ‌ల‌పై ఉపేంద‌ర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తుమ్మ‌ల బ‌ల‌మైన నేత అన‌డాన్ని ఆయ‌న అంగీక‌రించ‌లేదు. తుమ్మ‌ల‌కు అంత సీన్ వుంటే ఎందుకు గెల‌వ‌లేద‌ని ప్ర‌శ్నించ‌డం విశేషం.

ప్ర‌జ‌ల్లో వుండేది, గెలిచేది తానే అని ఉపేంద‌ర్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. నిత్యం ప్ర‌జ‌ల్లో వుండే త‌న‌లాంటి నాయకుడిని వారే గెలిపించుకుంటార‌ని ఆయ‌న అన్నారు. పాలేరు నుంచి ఎంత మంది పోటీ చేసినా త‌న గెలుపును అడ్డుకోలేర‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గోదావ‌రి జ‌లాల‌కు, తుమ్మ‌ల రాజ‌కీయానికి ఏం సంబంధ‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.