ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆ పార్టీలో ఏకాకిగా మారారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దీనికి పురందేశ్వరి స్వయంకృతాపరాధమే తప్ప, ఇతరులు కారణం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ బీజేపీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన మరు క్షణం నుంచి చంద్రబాబు పల్లకీ మోయడానికి పురందేశ్వరి ఉత్సాహం చూపారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పురందేశ్వరి ఫిర్యాదు చేశారు.
దివంగత ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణేన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా పురందేశ్వరి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమానికి కేవలం బీజేపీలోని తన సామాజిక వర్గం నాయకుల్ని మాత్రమే తీసుకెళ్లారనే విమర్శ వెల్లువెత్తింది. అంతేకాకుండా బీజేపీలో తన సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తూ పదవులు కట్టబెట్టారనే విమర్శ లేకపోలేదు. ఇలా పురందేశ్వరి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిననే విషయాన్ని మరిచి, తన సామాజిక వర్గం, అలాగే టీడీపీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న అభిప్రాయం కలిగించడంలో సక్సెస్ అయ్యారు.
ఈ వైఖరి ఆమెకు బీజేపీలో మైనస్ మార్కులు వచ్చేలా చేసింది. పురందేశ్వరిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే ఏ ఒక్క బీజేపీ నేత ఆమెకు అండగా నిలవని దుస్థితి. పురందేశ్వరి ధోరణిపై ఇటు ఇంటా, అటు బయటా విమర్శలు పెరిగాయి. కనీసం తన సామాజిక వర్గం నేతలు కూడా ఆమెకు మద్దతుగా ప్రకటనలు ఇవ్వలేదు. అలాగే ప్రెస్‌మీట్‌లు పెట్టడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
బీజేపీలో టీడీపీ ఏజెంట్‌గా పని చేస్తోందన్న అభిప్రాయం, అనుమానం కలిగేలా పురందేశ్వరి కలిగించడం వల్లే జాతీయ పార్టీ నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇదే రకంగా పురందేశ్వరి రాజకీయ పంథాను కొనసాగిస్తే మాత్రం త్వరలోనే ఆ పార్టీ మరింతగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన బీజేపీలో కనిపిస్తోంది.
గతంలో సోము వీర్రాజుకు కనీసం కొందరైనా మద్దతుగా ఉండేవారు. పురందేశ్వరి విషయానికి వస్తే ఎల్లో మీడియా కొద్దోగొప్పో అండగా ఉంటున్నదే తప్ప, సొంత పార్టీ నాయకుల అండ పూర్తిగా కొరవడిందనేది వాస్తవం.