బైక్ రేటు కంటే చలాన్ల ఖరీదే ఎక్కువ!

బాగా వాడేసిన బైక్ అది. సెకెండ్స్ లో అమ్మితే 10-15 వేల రూపాయల కంటే ఎక్కువ రాదు. అలాంటి బైక్ పై ఏకంగా 30వేల రూపాయల చలాన్లు ఉన్నాయి. దీంతో చేసేదేం లేక బైక్…

బాగా వాడేసిన బైక్ అది. సెకెండ్స్ లో అమ్మితే 10-15 వేల రూపాయల కంటే ఎక్కువ రాదు. అలాంటి బైక్ పై ఏకంగా 30వేల రూపాయల చలాన్లు ఉన్నాయి. దీంతో చేసేదేం లేక బైక్ ను పోలీసులకు అప్పగించి, నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యక్తి. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.

నంబర్ ప్లేట్లు లేకుండా ఓల్డ్ సిటీలో చాలా బైక్స్ తిరుగుతుంటాయి. ఇక హెల్మెట్ లేకుండా తిరిగే వాహనదారులు కూడా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ. దీనికితోడు సిగ్నల్ జంపింగ్స్ అక్కడ సర్వసాధారణం. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కేరాఫ్ ఆ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో కొన్నేళ్లుగా హెల్మెట్ పెట్టుకోకుండా యదేచ్ఛగా తిరిగేస్తున్నాడు మహ్మద్ ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి.

ఇతడికి హోండా యాక్టివా బైక్ ఉంది. దాన్ని నడుపుతూ ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకోలేదు ఫరీద్. దీనికితోడు ఎక్కడా సిగ్నల్స్ పాటించలేదు. అలా 2015 నుంచి ఈ బైక్ పై చలాన్లు పడుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ పోలీసులకు దొరకలేదు ఫరీదు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది.

ఏపీ 09 ఏయూ 1727 బండిని పోలీసులు పట్టుకున్నారు. అది ఫరీద్ బైకే. లెక్క తీస్తే 117 చలాన్లు వచ్చాయి. అవన్నీ లెక్కేస్తే 30వేల రూపాయలకు పైనే ఉంది. ఆ బైక్ ను ఉన్నఫలంగా అమ్మినా అంత మొత్తం రాదు. దీంతో చేసేదేం లేక బండిని పోలీసులకు అప్పగించి ఎంచక్కా నడుచుకుంటూ ఇంటికెళ్లిపోయాడు ఫరీదు.

అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఇలా పాత బండిని అడ్డం పెట్టుకొని చలాన్లు ఎగ్గొట్టాలని కొందరు వాహనదారులు భావిస్తున్నారు. ఏముందిలే దొరికితే బండి వదిలేద్దాం అనే ఆలోచనలో ఉంటారు. కానీ పోలీసులు బండిని సీజ్ చేసి వదిలేయడం లేదు. ఇలాంటి ''ప్రత్యేక'' వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు.