తన సినిమా పోస్టర్ తానే అతికించుకున్న హీరో

పెద్ద సినిమాకు ఆటోమేటిగ్గా ప్రమోషన్ దక్కుతుంది. ఆడియన్స్ దృష్టి ఆ సినిమాపై ఎప్పుడూ ఉంటుంది. మరి చిన్న సినిమా పరిస్థితేంటి? సంప్రదాయ పద్ధతిలో ఎంత గట్టిగా ప్రచారం చేసినా చిన్న సినిమాను సాధారణ ప్రేక్షకుడు…

పెద్ద సినిమాకు ఆటోమేటిగ్గా ప్రమోషన్ దక్కుతుంది. ఆడియన్స్ దృష్టి ఆ సినిమాపై ఎప్పుడూ ఉంటుంది. మరి చిన్న సినిమా పరిస్థితేంటి? సంప్రదాయ పద్ధతిలో ఎంత గట్టిగా ప్రచారం చేసినా చిన్న సినిమాను సాధారణ ప్రేక్షకుడు పట్టించుకోడు. కాస్త వినూత్నంగా ప్రచారం చేసినప్పుడు మాత్రమే అది ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడో హీరో అదే పని చేశాడు. తన సినిమా కోసం కొత్తగా ఆలోచించాడు, నలుగురి దృష్టిని ఆకర్షించాడు.

రామ్ అసుర్.. ఓ చిన్న సినిమా. శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు వినూత్నంగా ప్రచారం కల్పించాడు ఆ సినిమా హీరో అభినవ్ సర్దార్. హీరోయిన్ చాందినితో కలిసి రోడ్డుపైకొచ్చాడు. తన సినిమా పోస్టర్ ను తానే గోడపై అతికించుకున్నాడు. సర్దార్ చేసిన ఈ పని చాలామందిని ఆకట్టుకుంది.

హైదరాబాద్ లోని కొన్ని పబ్లిక్ ఏరియాల్లో హీరోహీరోయిన్లు ఇలా కలియతిరిగారు. తామే స్వయంగా రామ్ అసుర్ వాల్ పోస్టర్లను గోడలపై అతికించి అందర్నీ ఆకర్షించారు. ఇంతకుముందు సుధీర్ బాబు ఇలాంటి ఓ ప్రయత్నం చేశాడు. శ్రీదేవి సోడా సెంటర్ కు సంబంధించి పోస్టర్ అతికించి, ట్రయిలర్ రిలీజ్ మేటర్ ను ప్రకటించాడు. కానీ అదంతా ప్రైవేట్ వ్యవహారం. ఓ స్టుడియోలో గోడపై జరిగిన తంతు అది. రామ్ అసుర్ విషయంలో మాత్రం హీరోహీరోయిన్లు ఇలా రోడ్లపైకొచ్చి, జనాల మధ్య పోస్టర్లు అతికించారు.

ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేశారు. పేపర్ యాడ్స్, టీవీల్లో ప్రోమోలు వేశారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రచారం దక్కకపోవడంతో ఇలా రోడ్లపైకొచ్చి పోస్టర్లు వేశారు.

నిజానికి ఈ సినిమా అసలు పేరు ఇది కాదు. ముందుగా దీనికి పీనట్ డైమండ్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత దానికి రామ్ అసుర్ అని పేరు మార్చారు. పీనట్ డైమండ్ అనే పేరును ట్యాగ్ లైన్ గా మార్చేశారు. తమ సినిమా చాలా కొత్తగా ఉంటుందంటున్నాడు దర్శకుడు వెంకటేష్.