ఓ మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన మద్యనిషేధ కార్యక్రమం ఇప్పుడు పక్కదారి పడుతోంది. జగన్ ఆశయానికి తూట్లు పొడుస్తూ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. కాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం అనే రీతిలో సినీ ఫక్కీలో మద్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతున్నారు. ఒక్కో ఘటన చూస్తుంటే ఆశ్చర్యపోవడం జనాల వంతవుతోంది.
మొన్నటికిమొన్న 2 బైకుల్ని ఏపీ-తెలంగాణ సరిహద్దులో అడ్డుకున్నారు పోలీసులు. ఆ బైకులపై కొందరు వ్యక్తులు ఖాళీ సిలిండర్లను తీసుకెళ్తున్నారు. సహజంగా ఈ సీన్ లో పోలీసులకు అనుమానం వచ్చే ఛాన్స్ లేదు. కానీ సిలిండర్ ఎత్తి చూస్తే బరువుగా ఉంది. డౌట్ వచ్చి చెక్ చేస్తే.. సిలిండర్ నిండా మద్యం బాటిళ్లు. 2 సిలిండర్లలో వందకు పైగా బాటిళ్లను పట్టుకున్నారు కృష్ణా జిల్లా వత్సవాయి పోలీసులు
తాజాగా ఓ పాల బండిని పోలీసులు పట్టుకున్నారు. నిజానికి అదొక పాల ట్యాంకు. అన్-లోడ్ కూడా అయిపోయింది. కానీ తెలంగాణలో అన్-లోడ్ అయి, అక్కడే మద్యం సీసాలతో లోడ్ అయింది. ఈ బండిని గంటూరు పోలీసులు సీజ్ చేశారు. మరో ఘటనలో అమరావతి వద్ద వాటర్ ట్యాంక్ నిండా మద్యాన్ని పట్టుకున్నారు. వాటర్ ట్యాంక్ లో సుమారు 10వేల మద్య సీసాల్ని పట్టుకున్నారు.
ఇలా చేస్తే దొరికిపోతున్నామని భావించిన అక్రమార్కులు.. పాల పేరిట టెట్రా ప్యాకులు తయారుచేశారు. నిజానికి ఈ టెట్రా ప్యాకుల్లో ఉన్నవి పాలు కాదు, లిక్కర్. కర్నాటక బోర్డర్ నుంచి ఏపీలోకి వచ్చిన ఇలాంటి 2500 టెట్రా ప్యాకుల్ని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు.
మరికొంతమంది తెలంగాణ బోర్డర్ నుంచి మరో రకంగా స్మగ్లింగ్ స్టార్ట్ చేశారు. ఒంటి నిండా మద్యం బాటిళ్లు చుట్టుకొని వీళ్లు బైక్ పై బోర్డర్ దాటి ఏపీలోకి వస్తున్నారు. కొన్ని రోజుల పాటు బైకు, తెచ్చుకున్న బ్యాగును మాత్రమే తనిఖీ చేసిన పోలీసులు.. కొన్నాళ్లకు బైక్ పై వస్తున్న వ్యక్తుల్ని కూడా తనిఖీ చేయడంలో ఈ దందా బయటపడింది.
ఇవి కాకుండా కొరియర్, పార్శిల్ సర్వీసుల ద్వారా కూడా దర్జాగా లిక్కర్ బాటిళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాల్ని కూడా పోలీసులు గుర్తించారు. ఇలా ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన మద్యనిషేధ కార్యక్రమానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. స్మగ్లింగ్ కోసం తమ క్రియేటివిటీ మొత్తం ఉపయోగిస్తున్నారు.ఇలా దొరికినవి కొన్ని మాత్రమే. దొరకనివి ఇంకెన్నో.