పెళ్లికి ముందు ఉన్నంత ప్రేమ.. పెళ్లి తర్వాత ఉండదంటారు. ఇది ఎంత వరకు నిజమో చెప్పలేం కానీ, ఆ అమ్మాయి విషయంలో మాత్రం అక్షరాలా నిజమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతి.. ఓవైపు భర్తపై ప్రేమను చంపుకోలేక తనను తానే చంపుకుంది. మెదక్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.
కొల్చారం ఉప సర్పంచి కూతురు నవనీత ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. ఏడాదిగా ఇంట్లోనే ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన ప్రశాంత్, నవనీతకు వరుసకు బావ అవుతాడు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వీళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.
కానీ నవనీత-ప్రశాంత్ ఇద్దరూ తమ కుటుంబాల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరిలో వీళ్ల పెళ్లి జరిగింది. అప్పట్నుంచి 2 నెలల పాటు వీళ్ల కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత నుంచి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. నవనీత తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో తన బావ/భర్తకు సూసైడ్ లేఖ రాసి మరీ చనిపోయింది.
“హాయ్ బావ.. నీకు నేను అంత ఇష్టం లేనట్టుగా ఉంది. నాకంటే నీకు ఇష్టమైన వాళ్లు వేరే ఉన్నారు. నా చావు కబురు వింటావు” అంటా లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది నవనీత.
పెళ్లయిన 3 నెలలకు అదనపు కట్నం కోసం ప్రశాంత్ తల్లిదండ్రులు నవనీతను వేధించడం మొదలుపెట్టారు. దీనికి ప్రశాంత్ కూడా వత్తాసు పలకడంతో నవనీత తట్టుకోలేకపోయింది. నవనీత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.