ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జనసేన అధిపతి పవన్‌కల్యాణ్ మరో డెడ్‌లైన్ పెడతారా? విశాఖ ఉక్కుపై ప్రధానితో చర్చించేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్‌కు పవన్‌కల్యాణ్ వారం డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే.
గత నెలలో విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను కాపాడే బాధ్యత జగన్ సర్కార్‌దే అన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేసేందుకు వారం రోజులు గడువు ఇస్తున్నానని, ఆ తర్వాత తానేంటో చూపుతానని ఘాటు హెచ్చరికలు చేశారు.
ఆ తర్వాత డెడ్‌లైన్ ఊసేలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు ఆయన కార్యాచరణ మాటే లేదు. దీంతో ఎప్పట్లాగే పవన్‌కల్యాణ్‌ది ఆరంభ శూరత్వమే అనే విమర్శలు వెల్లువెత్తాయి. తమకు డెడ్‌లైన్ విధించడంపై పవన్‌కల్యాణ్‌ను ఓ రేంజ్లో వైసీపీ నేతలు ఆడుకున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదని వైసీపీ తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఈ నెల 21న నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు. మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే ప్రభుత్వ విధానాలపై ఆయన మాట్లాడనున్నారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.ఈ సభలో అఖిలపక్షం ఏర్పాటుకు జగన్ సర్కార్‌కు అవకాశం ఇచ్చేందుకు మరోసారి డెడ్‌లైన్ విధిస్తారా? అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. విశాఖ తర్వాత ఇది రెండో బహిరంగ సభ. అందుకే ఇలాంటి కామెంట్స్ ఎదురు కావడం!