పోలీసులు వివరాలు అడగడం కూడా తప్పేనా? 400 రోజుల పాటు సుదీర్ఘమైన నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారంటే.. దానికి భద్రత కల్పించడం కూడా అంత ఆషామాషీ విషయమేం కాదు. పోలీసులకు అది కత్తి మీద సాము. బోలెడన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం.. కొన్ని వివరాలు అడిగితే దాన్ని కూడా తప్పుపడుతూ.. దుష్ప్రచారం చేసుకోవడానికి పచ్చదళాలు ప్రయత్నిస్తున్నాయి.
27వ తేదీనుంచి నారా లోకేష్ చేయదలచుకున్న పాదయాత్రకు సంబంధించి పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు, రాత్రుళ్లు ఎక్కడ బసచేస్తారు, ఏయే వాహనాలు ఉంటాయి, వాటి నెంబర్లేంటి అంటూ డీజీపీ వర్ల రామయ్యకు లేఖ రాశారు. అయితే ఈ మాత్రం ప్రాథమిక వివరాలు అడగడమే పెద్ద నేరం అన్నట్టుగా తెలుగుదేశం దళాలు మాట్లాడుతున్నాయి.
రాష్ట్రంలో రాజకీయం పరంగా పరిస్థితులు చాలా సున్నితంగా తయారవుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలను పొందుతున్న వారిలో.. తెలుగుదేశం పట్ల ప్రబలమైన వ్యతిరేకత ఉంది. అందుకే చంద్రబాబు సభలు నిర్వహిస్తున్న వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన ప్రసంగాలకు ప్రజలనుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర పేరుతో మళ్లీ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ పోస్తే.. గ్రామాల్లో సామాన్యులైన ప్రజలు కూడా ప్రతిఘటించే అవకాశం మెండుగా ఉంటుంది. పాదయాత్రలో పాల్గొనే రూపంలో వచ్చి.. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల.. పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారనేది తెలుసుకోవడం పోలీసులు తీసుకుంటున్న ప్రాథమిక జాగ్రత్త అని మాత్రమే అనుకోవాలి.
తెలుగుదేశం వాదిస్తున్నట్టుగా పాదయాత్ర చేస్తున్నప్పుడు స్థానికంగా ప్రజలు వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. అది నిజమే కావొచ్చు.. పాదయాత్రలో ఎందరు పాల్గొంటారనే ఒక జాబితాను పోలీసులకు అందించి.. అదనంగా కొందరు స్థానికంగా అక్కడక్కడా కలిసే అవకాశం ఉంటుందని పేర్కొనవచ్చు. పాదయాత్ర కాన్వాయ్ లో ఉండే వాహనాల వివరాలు, రాత్రుళ్లు బస వివరాలు అన్నీ పోలీసులు తెలుసుకోవాలనుకోవడం కేవలం భద్రత ఏర్పాట్ల కోసమే.
రాత్రుళ్లు ఎక్కడ బసచేస్తారో, అవి భద్రమైన ప్రదేశాలో కాదో తెలియకుండా ఎవరైనా సరే ఎలా అనుమతులు ఇవ్వగలరు? పాదయాత్ర చేసేవారి రక్షణకోసం, భద్రత కోసం పోలీసులు వివరాలు అడిగినా కూడా దాన్ని రాద్ధాంతం చేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లుతోంది.
చూడబోతే నారా లోకేష్ కు పాదయాత్ర చేయడం కంటె.. దానికి ముడిపెట్టుకుని రాద్ధాంతం చేయడమే ఎక్కువ ఇష్టంగా కనిపిస్తోంది.