తెలుగునాట, తమిళనాట సంక్రాంతి సందర్భంగా విడుదలైన స్టార్ హీరోల సినిమాలు సినీ అభిమాన ముష్కరులను మరింత దిగజార్చాయి. ఇప్పటికే సినీ వీరాభిమానం ఈ ప్రాంతాల్లో చాలా వేషాలను వేసింది. ఈ క్రమంలో సంక్రాంతి సినిమాలు మరో లోతుకు తీసుకెళ్లాయి సినీ దురాభిమానాన్ని.
మా హీరో సినిమా హిట్టు, మీ హీరో సినిమా ఫ్లాఫ్ అంటూ .. నిందించుకోవడం, పోస్టర్ల మీద పేడ వేసుకోవడం తెలుగునాట ముందు నుంచి ఉన్న కథే. ఈ విషయాన్ని హీరోలు కూడా సరదాగానో, సీరియస్ గానో ప్రస్తావించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినీ దురాభిమానంతో తాము కూడా పోస్టర్లపై పేడ విసిరిన బాపతే అని చెప్పుకున్న ప్రముఖులూ ఉన్నారు. ఈ పోస్టర్ల మీద పేడ విసురుకునే కల్చర్ పోయి.. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకోవడం, బురద జల్లుకోవడం తీవ్రం అయ్యింది ప్రస్తుతానికి. పోస్టర్ మీద పేడ వేయాలంటే చేయికి మాత్రమే పూసుకోవాలి. సోషల్ మీడియాలో బురద జల్లుకునే వారు మాత్రం నిండా మురుగులో మునుగుతున్నారు. ఇష్టానుసారం చెలరేగిపోతూ ఉన్నారు.
సంక్రాంతి సందర్భంగా తెలుగు డైరెక్ట్ సినిమాల్లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ పోటీ వల్లనే ఆ సినిమాలకు కలెక్షన్లు వచ్చాయి తప్ప నిజంగా ఆ సినిమాల్లో అంత విషయం లేదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. కేవలం అవతల హీరో సినిమాకు పోటీ కాబట్టి.. తమ హీరో సినిమాకు వీలైనన్ని ఎక్కువ వసూళ్లను ఇవ్వాలంటూ ఫ్యాన్స్ కంకణం కట్టుకోవడం తెలుగునాట ముదిరిన సినీదురాభిమానానికి తార్కాణం ఇది. తమ కులం హీరో కాబట్టి అతడి సినిమా ఎలా ఉన్నా దాన్ని హిట్ చేయడానికి ఇన్ని పాట్లా! ఒక్కో రోజు ఒక్కోరు థియేటర్ నే బుక్ చేసుకుని సినిమాలు ఆడించడం, అది చేతగాకపోతే కనీసం టికెట్లను ఎక్కువ ధర పెట్టేసి కొనుక్కుని తమ హీరో సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్టుగా ప్రచారం దక్కేలా చేసుకోవడానికి ఈ వీరాధివీరాభిమానులు పడుతున్న ఆరాటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది.
టికెట్ ధరను ఎక్కువ రేటు పెట్టి కొని తమ హీరో సినిమాకు ఎక్కువ కలెక్షన్లు దక్కాయనే ప్రచారం పొందడానికి ఎవరికి వారు తమ వంతుగా కృషి చేస్తున్నారంటే.. ఈ కులాఐక్యమత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఉల్లిపాయల ధరలు పెరిగాయంటే స్ట్రైకులు జరిగే దేశం మనది. టమోటాలను కేజీ పది రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే , దాని వల్ల రైతుకు ఒక సీజన్లో కాస్తంత గిట్టుబాటు ధర దక్కుతుందని తెలిసినా.. నిరసనలు వ్యక్తం చేస్తారు. పెట్రో ధరలపై వాపోతారు. రాష్ట్రాలు పన్నులు వేస్తున్నాయంటూ విరుచుకుపడతారు.
మరి అన్నింటి విషయంలోనూ ఇంత అలర్ట్ గా ఉండే జనాలు సినిమా టికెట్ ను ఎక్కువ రేటును పెట్టి కొని తమ అభిమాన హీరో సినిమా పక్కన భారీ నంబర్ వినిపింపజేయడానికి పడుతున్న ఆరాటం మాత్రం నభూతో! థియేటర్ ఖాళీగా ఉంటోంది, దీంతో థియేటర్ వాళ్లు సినిమా ఎత్తేస్తున్నారనే వార్తల నేపథ్యంలో అభిమానులంతా ఏకమైపోయి తలా కొన్ని టికెట్లను కొనేసి ఖాళీ సీట్లకు అయినా సినిమాను చూపించిన ఉదంతాలు దశాబ్దాల కిందటే ఉండవచ్చు. అలా కొనే తాహతు లేకపోతే తమ అభిమాన హీరో సినిమాను థియేటర్ నుంచి తీసేసి వేస్తున్నారంటే థియేటర్ వద్దకు చేరుకుని నిరసనలు తెలిపినా వారూ ఉన్నారు!
కలెక్షన్లు లేకపోయినా తమ హీరో సినిమాను వంద రోజులు ఆడించాల్సిందే అని, అలా ఆడించలేకపోతే థియేటర్లపై దాడులకు వెనుకాడమంటూ ఉత్తుత్తి హెచ్చరికలు, థియేటర్లకు ఎదురు డబ్బులు కట్టి అయినా సినిమాలు ఆడించాల్సిందే అంటూ నిర్మాతలకు బహిరంగ హెచ్చరికలు జారీ చేసినా వారూ ఉన్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంది.
వంద రూపాయల టికెట్ ను రెండు వేలకు కొని.. హీరోగారి సినిమాకు ఎక్కువ కలెక్షన్ వచ్చిందంటూ చూపించడానికి అభిమానులు ఆరాటపడుతున్నారు. దీని వెనుక కేవలం సినీ అభిమానం కాదని, పతాక స్థాయికి చేరిన కులాభిమానమే ఇందుకు కారణమని స్పష్టం అవుతోంది. ఇలాంటి అభిమానులు ఉంటే హీరోలకు కూడా ఇంకేం కావాలి?
ఏడాదికో సినిమా చేసుకుంటే చాలు. అదెలా ఉన్నా.. ఇలాంటి కుల సంఘాలు, కుల గజ్జిగాళ్లు వేల రూపాయలు పెట్టి టికెట్ కొనేస్తారు. తమ వంతు బాధ్యతను వీరు పూర్తి చేసేస్తారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కోట్ల రూపాయల వసూళ్ల నంబర్ వినిపిస్తుంది. ఖేల్ ఖతం దుకాణ్ బంద్. మరో ఏడాది, మరో సంక్రాంతి, మరో సినిమా! ఏడాదికో సినిమానే కాబట్టి ఈ ఫ్యాన్స్ కూడా అది వచ్చినప్పుడు వెయ్యి రూపాయలేంటి, పది వేలు అయినా పెట్టేస్తారు. అభిమానం అలాంటిది మరి. ఇలాంటి కృత్రిమ కలెక్షన్లతో సినిమాలను హిట్ చేసుకోవడానికి కూడా వెనుకాడనంత కులాభిమానం తెలుగునాట ముదిరిపోయిందంటే ఈ విషయాన్ని బయటి వారికి చెప్పినా ఆశ్చర్యపోతారు.
తమిళనాట కూడా హీరోలపై దురాభిమానాలకు లోటు లేదు. అక్కడ కూడా ఇప్పుడు విజయ్ సినిమాకు కలెక్షన్లు లేవని, అజిత్ సినిమాకే కలెక్షన్నీ అని ఒక వర్గం, కాదు అజిత్ సినిమా బాక్సాఫీస్ వెలవెలబోతోందని విజయ్ సినిమా హిట్ అంటూ మరో వర్గం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటూ ఉంది. ఇలా ఎవరికి వారు తమ హీరో సినిమా హిట్టు, ప్రత్యర్థి సినిమా ఫట్ట్ అంటూ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే తమిళ సినీ దురాభిమానంలో కులం కోణం లేదు, తెలుగులో ఆ జాడ్యం కూడా ఉందంతే!