భారతదేశం ప్రధాన శక్తి ఏమిటి? అంటే గత రెండు దశాబ్దాల నుంచి గట్టిగా చెప్పగలిగే అంశం మానవ వనరులు. భారతదేశానికి ఇప్పుడు ప్రధాన వనరు మానవ వనరే. కష్టపడి పని చేయగల శక్తియుక్తులున్న మానవ వనరే భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. వ్యవసాయం అయినా, ఐటీ అయినా… పని చేయగలిగే వాళ్లే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రపంచానికి ఐటీ సేవలను అందించడంలో భారతదేశం ముందు వరసలో ఉంది. దీని వల్ల దేశానికి బోలెడంత విదేశీ మారకం అందుతోంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు కూడా స్వదేశానికి పంపడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంటున్నారు. అమెరికాలో సంపాదించి స్వదేశానికి పంపే వారి జాబితాలో భారతీయులే ముందు వరసలో ఉన్నారు. మరి ఈ తరహాలో సేవా రంగంలో సత్తా చూపించగలుగుతుండటం అంటే జనాభానే ఇండియాకు అతి పెద్ద ప్లస్ పాయింట్.
అలాగే వ్యవసాయరంగం మీద ఆధారపడి ఉన్న వారి సంఖ్య ఏమీ తక్కువ కాదు. దేశ జనాభాలో ఇప్పటికీ అత్యధికం ఆధారపడి ఉన్నది వ్యవసాయం మీదే. 140 కోట్ల జనాభా, వ్యవసాయం చేయడానికి బోలెడంత విస్తీర్ణం.. రుతుపవనాల మీద ఆధారపడిన జూదం అలా కొనసాగుతూ ఉంది. మరి ఇంత జనాభా ఉన్నా.. ఇప్పటికీ పని చేసే వాళ్ల అవసరమూ ఉంది, ఇంకా వారి లోటూ ఉంది. అటు ఐటీలో చూసినా నైపుణ్యంతో కూడిన వారి లోటు ఇంకా ఉండనే ఉందని, అలాంటి వారు తమకు కావాలని చెప్పని కంపెనీ ఉండదు. ఇక వ్యవసాయం లో కొత్త తరం కర్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే..40 యేళ్ల వయసులోపు వాళ్లలో కూలి పనులకు వెళ్లే వారి సంఖ్య బాగా తక్కువ అయ్యింది. నాట్లు వేయడం, కలుపుతీయడం వంటి పనులు చేసే వారి సంఖ్య మినిమం 40 లేదా 50 కి పైనే తప్ప, అంత లోపు వయసు వాళ్లు అలాంటి పనులకు వంగడం మానేసి చాలా కాలం అయ్యింది.
వ్యవసాయంలో కూలీల కొరత గట్టిగా ఉంది ఇప్పటికే. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది కూడా. కఠినమైన, కష్టమైన వ్యవసాయ పనులను చేయడానికి చాలా మంది మొగ్గు చూపడం లేదు. చదువు, ఉద్యోగాల వైపే ప్రాధాన్యత ఉండటంతో.. ఇప్పటికే గ్రామాల్లో కూలీల అందుబాటు తగ్గిపోయింది. కూళ్లు పెరిగిపోయాయి. దీని వల్ల వ్యవసాయం చేసే వారికి భారం అవుతోంది. మనిషికి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకూ కూలి దక్కుతోంది. అది రైతుకు భారం. అయితే పని చేసే వాడికి తక్కువ అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రేట్లుమరింత పెరిగి వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టే వాడు కరువు కావొచ్చు. అలాగే వ్యవసాయ పనులు చేసే వాళ్లూ తక్కువ కావొచ్చు!
ఇప్పటికే నిర్మాణ రంగంలో దక్షిణభారతదేశంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో నిర్మాణ రంగంలో పనులకు దక్షిణాది వారు వెళ్లడం లేదు. పనులు కష్టతరమైనవి కావడంతో.. ఆ పనుల వైపు వీరు చూడటం లేదు. దీంతో నిర్మాణ రంగంలో పనులన్నింటికీ ఉత్తరాది నుంచి కూలీలను తెప్పించుకుంటున్నారు. ఇది కేవలం నగరాల స్థాయికే పరిమితం కావడం లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో గ్రామాల స్థాయిలో కూడా నిర్మాణ రంగంలో రకరకాల పనుల్లో ఉత్తరాది వారే కనిపిస్తున్నారు. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు తరలి వచ్చి నిర్మాణరంగంలో పనిచేసే కూలీల సంఖ్య భారీ స్థాయిలో ఉంటుంది. ఇలా భారీ జనాభా ఉన్నప్పటికీ ఉపాధి విషయంలో, పనితీరు విషయంలో చాలా వ్యత్యాసాలున్నాయి.
ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి పని చేసుకునే కష్టజీవులకు అందే వేతనాలు కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. పట్టణాల్లో కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇంటి నిర్మాణ పనులు చేసే వాళ్లు కనిపిస్తారు. వారికి మళ్లీ ఏజెంట్లు. అన్నీ పోనూ వారికి దక్కే వేతనాలు రోజుకు మూడు వందల రూపాయల స్థాయిలోనే ఉంటాయి. అంతకు మించి ఏమీ లేదు. ఈ కష్టమైన పనులు చేయడానికి సౌత్ ఇండియన్లు పెద్దగా ఇష్టం చూపడం లేదు. ఓ మోస్తరు వ్యవసాయ పనులకే వీరి దిన కూలీ ఏడెనిమిది వందల రూపాయల స్థాయిలో ఉంటోంది. ఇలాంటి వ్యత్యాసాలున్నాయి. అయినప్పటికీ ఉత్తరాది నుంచి ఇక్కడకు వచ్చి నెలకు పది, పన్నెండు వేల రూపాయలు సంపాదించుకోవడమే గొప్ప అన్నట్టుగా పని చేసుకునే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది! ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాదిన ఈ మాత్రం ఉపాధి కూడా లేకపోవడం వల్లనే వారంతా ఇటు వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు.
భారీ స్థాయిలో జనాభా ఉండటం వల్ల ప్రస్తుతానికి అయితే కష్టజీవుల కొరత లేదు. రాబోయే రెండు దశాబ్దాల వరకూ కూడా ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. అయితే దేశంలో జనాభా భారీ స్థాయిలోనే ఉన్నా.. ముందు ముందు పెరుగుదల రేటు కాస్త తగ్గవచ్చు. దానికి అనేక సామాజిక పరిణామాలు కారణం అవుతాయి. చాలా దేశాల్లో జనాభా పెరుగుదల రేటు మందగించి, పని చేసే వాళ్ల సంఖ్య కూడా తక్కువైన దాఖలాలున్నాయి. అధిక జనాభా వల్ల మజ్జిగ పల్చన అవుతున్నా, ప్రస్తుతానికి దేశానికి జనాభా ఒక ప్రధాన వనరే!
-హిమ