ఆయనకు పాపం జీవితమంతా అలకలే!

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మీద మళ్లీ అలిగారు. కొత్తగా.. కొత్తగా ఏమైనా చెప్పండి అంటారా? నిజమే. అందులో కొత్త విషయం ఏమీ లేకపోవచ్చు. కానీ.. కోమటిరెడ్డి అలవాటుగా మళ్లీ అలిగారు. నిజం చెప్పాలంటే పార్టీ…

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మీద మళ్లీ అలిగారు. కొత్తగా.. కొత్తగా ఏమైనా చెప్పండి అంటారా? నిజమే. అందులో కొత్త విషయం ఏమీ లేకపోవచ్చు. కానీ.. కోమటిరెడ్డి అలవాటుగా మళ్లీ అలిగారు. నిజం చెప్పాలంటే పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా అలాగే ఉంది. ఆయన అలక పార్టీలోని కొందరికి ధర్మసమ్మతంగానే అనిపిస్తోంది. 

కానీ పార్టీలోని చాలామంది మాత్రం.. అలగడానికి మించి ఆయన ఏం చేయగలరు? ఆయన అలగడం, పార్టీ ఆయనను బుజ్జగించడం, ఆయన మళ్లీ సర్దుకుపోవడం ఇదంతా రొటీన్ గా జరిగే తంతే కదా? అంతకు మించి ఆయనకు వేరే గత్యంతరం మాత్రం ఏమున్నదని పలువురు అంటున్నారు కూడా. 

తాజాగా అలగడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఒక మంచి కారణం దొరికింది. కాంగ్రెసు పార్టీ ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్రంలో అభ్యర్థులను వడపోసే స్క్రీనింగ్ కమిటీని కూడా నియమించింది. కేంద్ర ఎన్నికల కమిటీలో తెలంగాణ వాటాకు ఎక్కువ బెర్తులు ఉండకపోవచ్చు. కానీ, నల్గొండ జిల్లాకే చెందిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందులో చోటు కల్పించారు. కానీ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో ప్రధానంగా రాష్ట్రంలోని నాయకులే పలువురు ఉంటారు. అయినా సరే, అందులో కూడా కోమటిరెడ్డికి చోటు దక్కలేదు. ఇంత పరాభవం జరిగిన తర్వాత కూడా అలగకపోతే ఎలాగ? అందుకే ఆయన అలిగారు. ఆ అలకలో తాను పార్టీకి రాజీనామా చేసేస్తానంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రేకు ఫోను చేసి చెప్పారు. 

అసలే ఎన్నికల ముంగిట్లో ఉన్న సమయంలో.. ఈ అలకలేమిటి అని కంగారు పడ్డారేమో ఠాక్రే హుటాహుటిన మరికొందరు నాయకుల్ని వెంటబెట్టుకుని కోమటిరెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడినుంచి కెసి వేణుగోపాల్ తో కూడా మాట్లాడించారు. ఆ బుజ్జగింపులు ఏ మేర ఫలించాయో తెలియదు. మరో పది రోజుల్లో పార్టీ భారీ బహిరంగసభ ప్లాన్ చేస్తుండగా.. ఆ సన్నాహాల్లో కోమటిరెడ్డి పాలు పంచుకోలేదు. 

కోమటిరెడ్డి గతంలో పీసీసీ చీఫ్ పదవి ఆశించి భంగపడ్డారు. అప్పుడొక సారి అలిగారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కమలతీర్థం పుచ్చుకున్న తర్వాత.. కోమటిరెడ్డిపై కూడా ఫిరాయింపు అనుమానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నికలలో పార్టీకి సహకరించకుండా విదేశాలకు వెళ్లిపోయిన ఆయన ప్రవర్తన కూడా అలాగే కనిపించింది. తర్వాతి పరిణామాల్లో తెలంగాణలో భాజపాకు అధికారంలోకి వచ్చేంత దృశ్యం లేదని ఆయన గుర్తించారు.  

నెమ్మదిగా పరిస్థితులతో రాజీపడ్డారు. రేవంత్ తో సఖ్యత కుదిరినట్టు కనిపించింది. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గానే ఉంటూ వచ్చారు. నకిరేకల్ అభ్యర్థిగా వేముల వీరేశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని, తాను వద్దంటే వీరేశానికి టికెటు ఎలా ఇస్తారని.. కోమటిరెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకుంటూ వచ్చారు. కానీ.. కనీసం రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో కూడా ఆయనకు చోటు లేకుండాపోయింది. ఈ కారణాలచేత ఆయన అలిగినట్టుగా తెలుస్తోంది. ఎంత అలిగినా.. తప్పక దిగివస్తారని వేరే మార్గం కూడా ఆయనకు లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.