తెలుగు రాష్ట్రాలలో పాదయాత్రల సీజన్ మొదలవుతోంది. ఈ నెలలో టీడీపీ అధినేత పుత్ర రత్నం నారా లోకేష్ పాదయాత్రతో పాటు, చంద్రబాబు అత్యంత ప్రియ శిష్యుడు టీ. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర కంటే ఒక రోజు ముందు అంటే జనవరి 26న భద్రాచలం నుండి తన పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
భద్రాచలంలో భారీ బహిరంగ సభను పెట్టి ప్రియాంకా గాంధీ చేతుల మీదగా తన పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే అధ్యక్షతన టీ. కాంగ్రెస్ పలు తీర్మానాలు చేసింది. పాదయాత్రతో పాటు ఠాక్రే భేటీకి మూడుసార్లు రాని నేతల నుండి వివరణ తీసుకోవడంతో పాటు, కీలక సమావేశాలకు రాని నేతలను పార్టీ నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు.
ఈ సంవత్సరంలో తెలంగాణ అసెంబ్లీకి జరగబోతున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకోని ఇప్పటికే వైయస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల, టీ. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విడతల వారిగా పాదయాత్రలు చేశారు. ఇప్పడు రేవంత్ రెడ్డి కూడా ఆరు నెలలు పాటు పాదయాత్ర చేస్తు ప్రజల్లోకి వెళ్లనున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ల గొడవల కారణంగా ఉనికి కొల్పోతుంది. రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని ఎంత వరకు ముందుకు తీసుకువెళ్తుంది అనేది తెలియాలి.
ఈ సంవత్సరం అంత.. ఒక వైపు నారా లోకేష్ పాదయాత్ర.. మరో వైపు చంద్రబాబు శిష్యులు.. రేవంత్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ బస్సు యాత్రతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడివేడిగా సాగనుంది.