రియా చక్రవర్తి.. బాలీవుడ్ నటిగా కంటే దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ గా ఆమెకు గుర్తింపు ఉంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ఆమె పరోక్ష కారణం అంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. సుశాంత్ తండ్రి కూడా ఆమెపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది రియా.
ఆ టైమ్ లో ఆమెపై నడిచిన ట్రోలింగ్ ను మాటల్లో చెప్పలేం, రాతల్లో చూపలేం. మళ్లీ ఇన్నాళ్లకు ఇనస్టా పోస్టుల ద్వారా లైమ్ లైట్లోకి వచ్చింది రియా. అయితే ఈసారి కూడా ఆమె ట్రోలింగ్ కి బలైంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జయంతి సందర్భంగా కొన్ని పాత ఫొటోలను రియా, తన ఇనస్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. గతంలో బయటపెట్టని ఫొటోలను ఆమె ఇప్పుడు పోస్ట్ చేసింది. కాఫీ మగ్ ల వెనక దాక్కున్న ఫొటో ఒకటి, బెడ్ పై పడుకుని తీసుకున్న సెల్ఫీ మరొకటి. ఈ రెండు ఫొటోలను ఆమె తన అభిమానులతో పంచుకుంది.
అయితే వీటిపై నెగెటివ్ కామెంట్లు పడుతున్నాయి. ఇంకా సుశాంత్ ని వదిలిపెట్టవా అంటూ కొంతమంది కామెంట్లు పెట్టారు, మరికొందరు ఇదంతా సింపతీ కోసమేనంటూ కౌంటర్లు వేశారు. నీకింకా సిగ్గురాలేదా అని ఒకరంటే, ఇలాంటి పోస్టింగ్ లు ఎన్ని పెట్టినా నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతుందంటూ మరొకరు గట్టిగా తగులుకున్నారు. అలా తన పోస్టింగ్ తో మరోసారి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది రియా.
రియాతో పాటు ఈరోజు బాలీవుడ్ లో చాలామంది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జయంతి సందర్భంగా ఫొటోలు పెట్టి నివాళులర్పించారు. రియా పోస్ట్ చేసిన ఫొటోకి కూడా నటీనటులు లైక్ లు కొట్టారు. కానీ సుశాంత్ అభిమానులు మాత్రం రియాని ఓ ఆట ఆడుకుంటున్నారు. అది ఏ రేంజ్ లో ఉందంటే, ఇప్పట్లో ఈ ట్రోలింగ్ వేడి చల్లారేలా లేదు.