Advertisement

Advertisement


Home > Politics - Opinion

'ఆరేసుకోబోయి' పాట‌కి కాయిన్స్ విసిరారు

'ఆరేసుకోబోయి' పాట‌కి కాయిన్స్ విసిరారు

అడ‌విరాముడు నిర్మాత‌ల్లో ఒక‌రైన సూర్య‌నారాయ‌ణ చ‌నిపోయారు. స‌త్య‌చిత్ర పేరుతో స‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి ఆయ‌న చాలా సినిమాలు తీసినా అడ‌విరాముడు ఆల్‌టైమ్ హిట్‌. ఆయ‌న భాగ‌స్వామి స‌త్య‌నారాయ‌ణ చాలా ఏళ్ల క్రిత‌మే మ‌ర‌ణించాడు. తాసిల్దార్‌గారి అమ్మాయి, ప్రేమ బంధం శోభ‌న్‌బాబుతో తీసారు. త‌ర్వాత భారీ బ‌డ్జెట్‌తో మ‌దుమ‌లై అడ‌వుల్లో అడ‌విరాముడు తీసారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అన్ని రోజులు అడ‌విలో షూటింగ్ చేయ‌డం చాలా విశేషం.

షూటింగ్ విశేషాలు సితారా పత్రిక‌లో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఒక‌టే ఎదురు చూసారు. రాఘ‌వేంద్ర‌రావు అంత‌కు మునుపు ద‌ర్శ‌క‌త్వం చేసినా, అడ‌విరాముడుతోనే స్టార్ డైరెక్ట‌ర్ అయ్యింది. 1977లో ఏప్రిల్‌లో రిలీజ్ అయిన త‌ర్వాత దాదాపు సంవ‌త్స‌రం పాటు ప్రేక్ష‌కుల్ని ఊపేసింది. పాట‌ల‌న్నీ సూప‌ర్‌హిట్‌. ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట కోసం ప‌దేప‌దే చూసిన వాళ్లున్నారు. ఈ పాట‌కి అభిమానులు వెర్రెక్కిపోయి స్క్రీన్ పైకి డ‌బ్బులు విసిరేవాళ్లు. అనంత‌పురం శాంతి టాకీస్‌లో డ‌బ్బులు విసిరే వాళ్ల‌ను ఆప‌డానికి సిబ్బంది కాప‌లా ఉండేది. పాట మొద‌ల‌వగానే థియేట‌ర్ అదిరిపోయేలా అరిచేవాళ్లు.

జ‌య‌ప్ర‌ద ఈ సినిమాతో క్రేజి హీరోయిన్ అయిపోయింది. జ‌య‌సుధ మేక‌ప్ లేకుండా గిరిజ‌న అమ్మాయిగా చేసింది. ఈ సినిమాకి మూలం 1973లో క‌న్న‌డ‌లో వ‌చ్చిన గంధ‌ద‌గుడి. అడవిలోని సంప‌ద‌ని కాపాడాల‌నే సందేశంతో వ‌చ్చిన మొద‌టి సినిమా ఇది. ఈ సూప‌ర్‌హిట్ సినిమాలో విష్ణువ‌ర్ధ‌న్ కాసేపు విల‌న్‌గా క‌నిపిస్తాడు. బందిపూర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో తీసారు. అడ‌విలో రాత్రి దృశ్యాలు అద్భుతంగా తీసారు. అప్ప‌టికి అది స‌రికొత్త ఫొటోగ్ర‌ఫీ. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నివారించి అట‌వీ అధికారిగా రాజ్‌కుమార్ చేసారు. ఆయ‌నకి 150వ సినిమా.

అడ‌వి దొంగ‌గా ఎదిగి 1972లో అరెస్ట్ అయిన‌ప్ప‌టికీ వీర‌ప్ప‌న్ పేరు ఈ సినిమా తీసే నాటికి ఎవ‌రికీ తెలియ‌దు. అడ‌వి దొంగ‌ల ఆట క‌ట్టించిన అధికారిగా బందిపూర్ అడ‌విలో న‌టించిన రాజ్‌కుమార్, త‌ర్వాత రోజుల్లో అదే అడ‌విలో వీర‌ప్ప‌న్ చేతిలో కిడ్నాప్ కావ‌డం ఒక విచిత్రం, విషాదం.

షోలేలోని అనేక స‌న్నివేశాల్ని అడవిరాముడులో య‌థాత‌ధంగా వాడుకున్నారు. అయినా జ‌నం ప‌ట్టించుకోలేదు. అడ‌వి నేప‌థ్యం ఏనుగులు హీరోకి సాయం చేయ‌డం, పాట‌ల‌కి ఎన్టీఆర్ స్టెప్పులేయ‌డం, జ‌య‌ప్ర‌ద గ్లామ‌ర్‌, డైలాగ్‌లు, బిగువైన స్క్రీన్ ప్లే అన్నీ క‌లిసి 1977 సూప‌ర్‌హిట్ మూవీ చేశాయి.

నిర్మాత‌ల‌కి క‌న‌క వ‌ర్షం కురిపించిన సినిమా. వాళ్ల ఇంటికి సంచుల్లో నోట్ల క‌ట్ట‌లు వ‌చ్చేవ‌ని చెప్పుకున్నారు (అప్ప‌టికి 500, వెయ్యి నోట్లు లేవు). అడ‌విరాముడు త‌ర్వాత స‌త్య‌చిత్ర బ్యాన‌ర్ చాలా సినిమాలు తీసింది కానీ, ఏమీ గుర్తు పెట్టుకునేవి కావు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?