భారీ అంచ‌నాల వైసీపీ ఎమ్మెల్యేపై అసంతృప్త స్వ‌రం!

గ‌త ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్ నుంచి బాగా సానుభూతి పొందిన నేత తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి. అప్ప‌టికే వ‌ర‌స‌గా రెండు సార్లు ఓడిపోయి ఉండ‌టం, అది కూడా ఒక‌సారి…

గ‌త ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్ నుంచి బాగా సానుభూతి పొందిన నేత తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి. అప్ప‌టికే వ‌ర‌స‌గా రెండు సార్లు ఓడిపోయి ఉండ‌టం, అది కూడా ఒక‌సారి విజ‌యం ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర వ‌ర‌కూ వ‌చ్చి ఓడిపోవ‌డం, మూడో సారి పోటీకి రెడీ కావ‌డం.. చాలా క‌ష్ట‌ప‌డుతుండ‌టం.. వంటి కార‌ణాల చేత ప్ర‌కాష్ రెడ్డిని ఈ సారి ఎలాగైనా గెలిపించుకోవాల‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్ భావించింది. అలాగే సామాన్య జ‌నంలోనూ ప్ర‌కాష్ రెడ్డిపై అప్పుడు సానుభూతి వెల్లువెత్తింది. ఆ పై జ‌గ‌న్ గాలి క‌లిసి వ‌చ్చింది! దీంతో ప్ర‌కాష్ రెడ్డి భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు.

తెలుగుదేశం పార్టీ కంచుకోట‌, ప‌రిటాల కుటుంబానికి పెట్ట‌ని కోట అనే చోట ప్ర కాష్ రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. అలా భారీ అంచ‌నాల మ‌ధ్య‌న ఆయ‌న ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అంచ‌నాలు భారీగా ఉన్న‌ప్పుడు.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా అసంతృప్తి ఎక్కువ‌వుతుంది. ఇప్పుడు ప్ర‌కాష్ రెడ్డి ప‌రిస్థితి అలానే ఉన్న‌ట్టుగా ఉంది!

రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కాంగ్రెస్-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప‌రులు ద‌శాబ్దాలుగా ప్ర‌తిప‌క్షంగానే మిగిలిపోయారు. ప‌రిటాల కుటుంబం అలాంటి వారిని అణిచివేస్తూ వ‌చ్చింది. అది చాలా పాత క‌థ‌. క‌న‌గాన‌ప‌ల్లె, చెన్నేకొత్త‌ప‌ల్లి వంటి మండ‌లాల్లో కాంగ్రెస్- వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ప‌ట్టిన వారు ద‌శాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కూ రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ‌ర‌డంతో వారు ఎమ్మెల్యేపై భారీ అంచ‌నాల‌ను పెట్టుకున్నారు. తాము చెప్పింద‌ల్లా ఎమ్మెల్యే చేస్తారు, ప్ర‌కాష్ రెడ్డి త‌మ‌లో ఒక‌రు అన్న‌ట్టుగా వాళ్లు ఫీల‌య్యారు.

ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాకా ప్ర‌కాష్ రెడ్డి తీరులోనూ కొంత మార్పు వ‌చ్చింద‌ని స్థానికులు అంటున్నారు. ఇన్నాళ్లూ ఆయ‌న క‌రువులోనే బ‌తికాడు కాబ‌ట్టి.. ఇప్పుడు కొంచెం ఆరాట‌ప‌డుతున్న‌ట్టుగా ఉన్నారు. పార్టీ క్యాడ‌ర్ మ‌రింత క‌రువును అనుభ‌వించింది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే ఇంటి ముందు వారి ప‌డిగాపులు ఎక్కువ‌య్యాయి. అలాంటి వారిని ఎమ్మెల్యే క‌సురుకుంటున్నాడు అనేది ప్ర‌ధాన‌మైన ఫిర్యాదు!

చిన్న చిన్న ప‌నుల కోసం వ‌చ్చిన వారిని కూడా ప్ర‌కాష్ రెడ్డి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, కొన్ని ప‌నుల విష‌యంలో అయితే పార్టీ క్యాడ‌ర్ ను అస్స‌లు లెక్క చేయ‌డం లేద‌ని, ఇలా క్యాడ‌ర్ ను బాగా నిస్పృహ‌కు గురి చేస్తూ ఆయ‌న అసంతృప్తి క‌లిగిస్తున్నాడ‌నేది లోక‌ల్ టాక్.

అయితే ప్ర‌కాష్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల మీదే దృష్టి పెట్టిన‌ట్టుగా ఉన్నాడు. బాగా క‌రువు ప్రాంతం అయిన నియోజ‌క‌వ‌ర్గానికి నీటి స‌దుపాయాన్ని క‌లిగిస్తే..త‌న‌కు రాజ‌కీయంగా తిరుగు ఉండ‌దు అనే భావ‌న‌తో ఆయ‌న ప‌ని చేస్తున్న‌ట్టుగా ఉన్నాడు. అది ఓకే, అయితే పార్టీ క్యాడ‌ర్ మాత్రం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. ఆయ‌న‌ను త‌మ వాడిగా భావించిన వారే ఇప్పుడు అస‌హ‌నానికి గుర‌వుతున్న ప‌రిస్థితి వ్య‌క్తం అవుతోంది.

ఈ తీరును ఆ ఎమ్మెల్యే స‌రి చేసుకోవాల‌నేది వారి మాట‌. జ‌గ‌న్ ఇమేజ్ ను ప‌క్క‌న‌పెడితే, ప్ర‌కాష్ రెడ్డి ఇలా ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పోతే.. రాజ‌కీయ ప‌రిస్థితులు ఆయ‌న‌కే ఇబ్బందిక‌రంగా మార‌తాయ‌ని వారు అంటున్నారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌పై అంత ఒత్తిడి లేదు. ఎందుకంటే అక్క‌డ క్యాడ‌ర్ మ‌రీ తీవ్ర ఇబ్బందులు ప‌డ‌లేదు. ప‌రిటాల కుటుంబం దెబ్బ‌కు బాగా ఇబ్బందులు ప‌డిన క్యాడ‌ర్ రాప్తాడు ప‌రిధిలోనే ఉంటుంది. ప్ర‌కాష్ రెడ్డి ఎలా అయితే ప్ర‌త్యేక‌మైన ఎమ్మెల్యే అవుతాడో, అక్క‌డి క్యాడ‌ర్ కూడా అంతే ప్ర‌త్యేక‌మే అవుతుంది. ఈ ప‌రిస్థితిని ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటున్న‌ట్టుగా లేడో లేక అర్థం అయ్యీ కాన‌ట్టుగా ఉన్నాడో!