పైకి తాము గమ్మున అయిపోయినట్టుగా, ఇప్పుడప్పుడే ఏం మాట్లాడేది లేదని జేసీ దివాకర్ రెడ్డి లీకులిస్తున్నారు. రాజకీయ ప్రతీకార చర్యలు సాగుతున్నాయని జేసీ వాపోతున్నారట.
అయినా తాడిపత్రి నియోజకవర్గం ప్రాంతంలో గడిచి దాదాపు మూడు దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో అధికారం చలాయించిన జేసీ దివాకర్ రెడ్డి .. ఇప్పుడు రాజకీయ ప్రతీకార చర్యలు అనే మాట అంటుండటం విడ్డూరమని పరిశీలకులు అంటున్నారు!
ప్రత్యర్థులను అణగదొక్కడంలో జేసీ దివాకర్ రెడ్డిది అందె వేసిన చెయ్యి అని అనేది కొత్త మాట ఏమీ కాదు. ఆఖరికి సొంత పార్టీలోనే తనకు నచ్చని నేతలపై ఆయన రచ్చ చేస్తూ ఉండటాన్ని అంతా గమనించే ఉంటారు.
తాడిపత్రి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా వచ్చినప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు జేసీ సోదరులు. పెట్టుడు కేసులతో ఆయనను జైల్లో పెట్టించారు. అది కూడా నెలల కొద్దీ!
మరి తన ప్రత్యర్థిని అలా జైలు పంపి వేడుక చూసిన జేసీ సోదరులు తమ వరకూ వచ్చేసరికి మాత్రం తట్టుకోలేకపోతున్నారా! అనేది సామాన్యుడి ప్రశ్న!
ట్రావెల్స్ బస్సుల అక్రమాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అరెస్టు కావడం, ఆ తర్వాత పోలీసును దూషించిన వ్యవహారంలో ప్రభాకర్ రెడ్డి మళ్లీ అదే జైలుకే వెళ్లడం తెలిసిన సంగతే. ఈ క్రమంలో జేసీ చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. తాడిపత్రి నియోజకవర్గంలో మరో పంచాయతీ చేయబోయి ఎదురుదెబ్బ తిన్నాడు దివాకర్ రెడ్డి.
ఆ ఊరికి సమీపంలోనే ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఒక కార్మికుడు ప్రమాదవశాత్తూ ఆ ఫ్యాక్టరీ ఆవరణలోనే మరణించాడు. చెట్టుమీద నుంచి పడి అతడు చనిపోయాడని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఆయన మరణంపై కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రిలో ఆ కార్మికుడి మృతదేహానికి పోస్టుమార్టాన్ని అడ్డుకుని వారు నిరసన తెలిపారు.
దీంతో జేసీ దివాకర్ రెడ్డి రంగప్రవేశం చేశారు. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ఆయన యత్నించినట్టుగా ఉన్నారు. అయితే అది బెడిసి కొట్టింది. ఫ్యాక్టరీ జులుం నశించాలని.. కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని దివాకర్ రెడ్డి అరవాలని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి కూడా చేరుకున్నారు. అయితే బాధిత కుటుంబీకులు ఆయనను పట్టించుకోలేదట. వారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నమ్ముకున్నారు. తమకు న్యాయం జరగాలంటూ ఆయన దగ్గరకే వారు చేరినట్టుగా తెలుస్తోంది.
ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడిన ఎమ్మెల్యే బాధితుడి కుటుంబానికి పదిలక్షల రూపాయల నగదు, బాధితుడి భార్యకు పెన్షన్ ఇచ్చేట్టుగా ఒప్పించినట్టుగా తెలుస్తోంది. దీంతో వారు శాంతించారు.
మధ్యలో ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చాలని చూసిన దివాకర్ రెడ్డిని వాళ్లు పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆసుపత్రి వరకూ వెళ్లిన దివాకర్ రెడ్డి కామ్ గా వెనుదిరగాల్సి వచ్చిందట.
'మీ సావు మీరు చావండి..నా తోటకు నేను పోతా..' అంటూ దివాకర్ రెడ్డి అక్కడ నుంచి రయ్ మంటూ తన వాహనంలో వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న దివాకర్ రెడ్డి ప్రయత్నానికి అలా భంగం కలిగినట్టుగా తెలుస్తోంది.