జబర్దస్త్ రగడ: హైపర్ ఆది ఎటువైపు?

జబర్దస్త్ కార్యక్రమం భారీ కుదుపులకు లోనైందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ముందుగానే వెల్లడించింది. ఎప్పుడైతే ఈ జట్టు నుంచి నిఖిల్ అండ్ కో తప్పుకుందో, అప్పట్నుంచే జబర్దస్త్ లో రగడ మొదలైంది. జీ తెలుగు…

జబర్దస్త్ కార్యక్రమం భారీ కుదుపులకు లోనైందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ముందుగానే వెల్లడించింది. ఎప్పుడైతే ఈ జట్టు నుంచి నిఖిల్ అండ్ కో తప్పుకుందో, అప్పట్నుంచే జబర్దస్త్ లో రగడ మొదలైంది. జీ తెలుగు ఛానెల్ ను ఆశ్రయించిన ఈ క్రియేటివ్ జంట, తన పరిచయాలతో జబర్దస్త్ టీమ్స్ లోని సభ్యుల్ని బయటకు లాగడం ప్రారంభించారు.

రింగ్ మాస్టర్ లాంటి నాగబాబు బయటకొస్తే, ఆటోమేటిగ్గా టీమ్ సభ్యులంతా బయటకొస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ముందుగా నాగబాబును బయటకు లాగారు. ప్రస్తుతం నాగబాబు జబర్దస్త్ కు పనిచేయడం లేదు. అయితే టీమ్స్ అన్నీ ఒకెత్తు, హైపర్ ఆది ఒక్కడు మరో ఎత్తు.

జబర్దస్త్ లో ఇప్పుడు హైపర్ ఆది కీలక వ్యక్తిగా మారాడు. ఇతడి స్కిట్స్ కే ఎక్కువగా టీవీల్లో రేటింగ్స్, యూట్యూబ్ లో వ్యూస్ వస్తుంటాయి. ఇలాంటి కీలకమైన వ్యక్తి ఇప్పుడు ఎటువైపు అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికైతే హైపర్ ఆది జబర్దస్త్ లోనే ఉన్నాడు. భారీ పేమెంట్ ఆఫర్ కావడంతో, అతడికి కూడా బయటకు రావాలనే ఉంది కానీ ప్రస్తుతం లీగల్ సమస్యల్లో ఇతడు ఇరుక్కున్నట్టు తెలుస్తోంది.

ఒప్పందం ప్రకారం, అతడు కేవలం “మల్లెమాల”కు మాత్రమే పనిచేయాలని వాదిస్తోంది ఆ సంస్థ. దీనిపై కాస్త గట్టిగానే వాదోపవాదాలు జరుగుతున్నాయి. చివరికి ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటే, తమ అనుమతి లేకుండా హైపర్ ఆది సినిమాల్లో కూడా నటించడానికి వీల్లేదనే వరకు వెళ్లింది. దీంతో హైపర్ ఆది కూడా షాక్ అయ్యాడు.

నిజానికి హైపర్ ఆదికి ప్రస్తుతం జబర్దస్త్ చేయాలని లేదు. అతడికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. వెంకటేష్ లాంటి హీరో కూడా వెంకీమామలో హైపర్ ఆదిని తీసుకోమని వ్యక్తిగతంగా సిఫార్స్ చేశాడంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. సో.. ఇప్పుడు హైపర్ ఆదిపై ఎలాంటి లీగల్ సమస్యలు నడుస్తున్నా, భవిష్యత్తులో అతడు టీవీకి దూరమవ్వడం మాత్రం ఖాయం.