రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు తేల్చి చెప్పారు. జనసేన వీర మహిళల సమావేశంలో పాల్గొనేందుకు కర్నూలుకు వెళ్లిన ఆయన, అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా పొత్తులు ఎవరితో పెట్టుకుంటారనే సంగతి తనకు తెలియదన్నారు. అలాగే పవన్‌కల్యాణ్ ఎక్కడి పోటీ చేస్తారనేది సస్పెన్స్ అని అన్నారు. తన విషయమై నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలబడాలనే ఆసక్తి తనకు లేదన్నారు. కేవలం జనసేన పార్టీ నిర్మాణంపై తాను దృష్టి పెడతానన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. సింహం సింగిల్‌గా వస్తుందని వైసీపీ నేతలు అంటున్నారని, జనసేన మాత్రం పొత్తులతో వస్తుందా? అనే ప్రశ్నకు ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. అలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
జర్మనీని ఓడించడానికి అమెరికా, రష్యా లాంటి దేశాలు ఏకం కావడాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన ఆ రేంజ్లో చూడడం విశేషం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పొత్తులు పెట్టుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు గుర్తు రాలేదో అని నాగబాబు కామెంట్స్‌పై అధికార పార్టీ విరుచుకుపడుతోంది.
అప్పుడు చంద్రబాబుకు మళ్లీ పట్టం కట్టేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే పవన్ ఒంటరిగా పోటీ చేశారని అధికార పార్టీ విమర్శిస్తోంది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ముందే చెబితే, అక్కడ ఓడిస్తారనే భయం నాగబాబు మాటల్లో కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించడం పక్కా అని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.