కాంతార సూపర్ హిట్ తో ఆ బ్రాండ్ ని మరింత పెద్ద స్థాయిలో ఉపయోగించుకోవాలనుకుంటోంది నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. సినిమా ఇచ్చిన పేరుతో మరింత పెద్ద ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు దర్శక హీరో రిషభ్ శెట్టి. ఈ ప్రయత్నాల్లో నుంచి పుట్టుకొస్తోంది కాంతార-2. అయితే ఇది కాంతారకు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. కాంతారకు ముందు ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నారు.
భారీ బడ్జెట్ తో ప్రీక్వెల్..
కాంతార సూపర్ హిట్ కావడంతో కాంతార-2పై మరింత భారీ బడ్జెట్ కుమ్మరించేందుకు రెడీ అయింది నిర్మాణ సంస్థ. ప్రస్తుతానికి బడ్జెట్ కి బౌండరీలు లేవని మాత్రమే చెబుతున్నారు నిర్మాతలు. అయితే రాబోయే ఐదేళ్లలో సినిమాలు,వెబ్ సిరీస్ ల కోసం 3వేల కోట్ల రూపాయలను హోంబలే ఫిలిమ్స్ ఖర్చు చేయబోతోందని నిర్మాతలు తెలిపారు.
పని మొదలైంది..
కాంతార-2 పని ఇప్పటికే మొదలైందని అన్నారు హోంబలే సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కిర్గందూర్. స్క్రిప్ట్ పని కోసం ఆల్రడీ రిషభ్ శెట్టి తన టీమ్ తో కలసి కర్నాటక అడవుల్లో రీసెర్చ్ కోసం వెళ్లారట. ప్రీక్వెల్ లో గ్రామస్తులు, గ్రామ పెద్ద, దేవుడి మధ్య జరిగే కథ ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో చాలా భాగం అడవుల్లో, అందులోనూ వానల్లో చిత్రీకరించాల్సి ఉంటుందట. అందుకే వర్షాకాలం మొదలయ్యే సమయానికి కాంతార-2 షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు నిర్మాతలు.
హోంబలే ఫిల్మ్స్ కి సిరీస్ లు బాగా అచ్చొచ్చాయి. కేజీఎఫ్ చాప్టర్-1, చాప్టర్-2 అదరగొట్టాయి. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార-2 కూడా అంతే ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. కాంతార విడుదల సమయంలో దాన్ని పాన్ ఇండియా స్థాయికి చేర్చుతారనుకోలేదు. కానీ అన్ని భాషల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కాంతార-2ని మాత్రం పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని రెడీ చేస్తున్నారు. అందుకే దీనిపై భారీ అంచనాలున్నాయి.