రాష్ట్రంలో ఇప్పటివరకూ కుల రాజకీయాలే చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ వర్సెస్ రెడ్డి రాజకీయాలు ఇప్పటి వరకూ జరిగాయి. టీడీపీ పుట్టుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఓ వర్గం దాదాపుగా బయటికొచ్చేసింది. వైసీపీ పుట్టాక కాంగ్రెస్ నుంచి మరో వర్గం పూర్తిగా జగన్ కు మద్దతుగా నిలిచింది. స్థానిక నేతలు ఎవరైనా.. ఈ రెండు కమ్యూనిటీలు మాత్రం గత ఎన్నికల్లో విస్పష్టంగా విడిపోయి ఎవరి పార్టీ గెలుపు కోసం వారు కృషి చేశారనేది వాస్తవం.
తెలంగాణలో ప్రస్తుతం వెలమలు, రెడ్ల మధ్య క్యాస్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇక ప్రజారాజ్యం ఆవిర్భావంతో మరో ప్రధాన సామాజిక వర్గానికి కూడా పార్టీ పుట్టిందని అనుకున్నారంతా. ఆ కథ ముగియడం, దానికి కొనసాగింపుగా జనసేన రావడంతో దానిపై కూడా కాపు ముద్ర బలంగానే పడింది. ఏ కులంవారు ఎంత కృషిచేసినా అంతిమంగా అన్ని కులాల మద్దతు ఉన్నవారే అధికారం చేజిక్కించుకుంటారన్నది వాస్తవం.
ఈ కులరాజకీయాలతో లాభం లేదనుకుంటున్నారో ఏమో.. కొత్తగా మత రాజకీయాల్ని తీసుకొస్తున్నారు కొంతమంది దౌర్భాగ్యులు. ఏపీలో బీజేపీ ఇప్పటివరకూ ఇలా తోకజాడించలేదు కానీ, ఎందుకో జగన్ ఆధిపత్యాన్ని ఆ పార్టీ సహించలేకపోతోంది. ఇంగ్లిష్ మీడియంతో మొదలైన గొడవ చివరకు మత మార్పిడులు, ఏపీలో క్రిస్టియన్ల సంఖ్య పెరగడం వంటి అంశాల దగ్గరకు వచ్చి ఆగింది.
సో.. ఏపీలో మత రాజకీయాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఓ పద్ధతి ప్రకారం పావులు కదుపుతోందని అర్థమవుతోంది. టీడీపీలో కూడా ఈ ధోరణి స్పష్టమవుతోంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని జగన్ అవమానించారు, కొడాలి నాని తన విమర్శల్లో వెంకటేశ్వరుడ్ని కించపరిచారు, వల్లభనేని వంశీ అయ్యప్ప మాలను అవమానించేలా ప్రవర్తించారు.. ఇలా ఈ దుష్ప్రచారం సాగుతోంది. జగన్ బీసీ ద్వేషి అనే ముద్ర వేయడానికి ప్రయత్నించడం కూడా మత రాజకీయాల్లో భాగమే.
మొత్తమ్మీద ఏపీలో రాజకీయం మెల్లమెల్లగా మతం రంగు పులుముకుంటోంది. జగన్మోహన్ రెడ్డిపై కుల ముద్ర వేసి ఏమీ చేయలేమని అర్థం కావడంతో.. మతం ముద్రవేసి హిందువులకు ఆయన్ని శత్రువులా చూపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కుమ్మక్కై మతరాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయనే విషయం బయటకు కనిపిస్తూనే ఉంది.
దీనికి ఓ వర్గం మీడియా వత్తాసు పలుకుతూ కల్పిత కథలతో ప్రజల్లో విషబీజాలు నాటుతోంది. జెరూసలేం యాత్రలకు నిధులు పెంచారని, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో మత బోధన మొదలు పెడతారని, విదేశీ మిషనరీలతో, చారిటీ ట్రస్ట్ లతో కూడిన ఓ భారీ డీల్ ఇదని సోషల్ మీడియాలో కూడా దుష్ప్రచారం సాగుతోంది.
దీని పర్యవసానం ఏంటో కాలమే నిర్ణయించాలి. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలకు ప్రజలు బలవకుండా ఉండాలంటే.. ఈ విష వృక్షాల్ని మొగ్గలోనే తుంచేయాలి. లేకపోతే ఉత్తరాది మత కల్లోలాలు ఏపీకి అంటుకునే ప్రమాదం ఉంది.