తెలంగాణ కాంగ్రెస్‌కు కొండా సురేఖ షాక్ ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ డిమాండ్ చేయడం గమనార్హం. ఇందుకు గాంధీభవన్‌ను ఆమె వేదిక చేసుకున్నారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కొండా సురేఖ తనదైన శైలిలో ఆమె నిర్భయంగా మాట్లాడ్డంతో సీనియర్ నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర ముఖ్య నేతలు హాజరైన సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ కలిసికట్టుగా పని చేయకపోవడం వల్లే ఓడిపోయామని వాపోయారు. పార్టీకి నష్టం చేసే వాళ్లను ఊరికే విడిచిపెట్టాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి విజయం కోసం పని చేసి, కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు.
దీంతో సీనియర్ నేతలు ఖంగుతిన్నారు. కాసేపటికి తేరుకున్న రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ… వ్యక్తిగత అంశాలు మాట్లాడొద్దని సూచించారు. ఫిర్యాదు చేయాల్సిన అంశాలేవైనా వుంటే ఇన్‌చార్జ్‌ను కలవాలని కొండా సురేఖకు రేవంత్‌రెడ్డి సూచించడం గమ నార్హం. సమావేశం ఎజెండాకే పరిమితం కావాలని సురేఖకు ఆయన సూచించారు. ఏడాది తర్వాత గాంధీభవన్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం వెళ్లిన సంగతి తెలిసిందే.
గాంధీభవన్‌లో కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి పరస్పరం చెవులు కొరుక్కుంటున్నట్టు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఇద్దరి నేతల మధ్య శత్రుత్వం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరి సయోధ్య కుదిరిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు సురేఖ డిమాండ్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందా? అనేది చూడాలి.