మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మొదటి నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కొరకరాని కొయ్యే. ఇప్పుడంటే అధికార పక్షంలో ఉండడంతో కొడాలి నాని బాబుపై ఒంటికాలిపై లేస్తున్నారని అంటున్నారు. కానీ అది అసత్యం. కొడాలి నాని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కూడా బాబుపై ఇదే దూకుడు ప్రదర్శించారు. అందుకే 2019 ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నానీని అసెంబ్లీ అడుగు పెట్టనివ్వకూడదని చంద్రబాబు గట్టి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. అంతేకాదు, మంగళగిరి తన కుమారుడిని కూడా గెలిపించుకోలేక పోయారు.
ప్రస్తుతానికి వస్తే…కొడాలి నాని శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు, దేవినేని ఉమాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరికీ ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. దీంతో దేవినేని ఉమా మీడియా ముందుకొచ్చి కొడాలికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నాని విమర్శల దాడికి ఉమా కౌంటర్ ఏ స్థాయిలోనూ సమాధానం నిలవలేకపోయింది.
కొడాలి నానికి దేవినేని ఉమా సరిపోలేదనే ఉద్దేశంతో, నటి, తమ పార్టీ నాయకురాలైన దివ్యవాణిని రంగంలోకి దింపింది. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మాట్లాడుతూ నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని పనితీరు, మాటలు ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. నానీని చూస్తుంటే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు ఉందని సినిమా డైలాగ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
చంద్రన్నది నిజంగా చంద్రమండలం స్థాయేనని కొడాలి తెలుసుకోవాలని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానీకి తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వయస్సు గురించి, చావుల గురించి మాట్లాడటానికి నాని ఏమైనా యమధర్మరాజుకి శిష్యుడా? అని ప్రశ్నించారు. నానికి చంద్రబాబుపై ఎంత ద్వేషముందో.. ఆయన మాటల్లోనే తెలుస్తోందన్నారు.
చంద్రబాబును.. నాని లాంటి వాళ్లు ఎన్ని అన్నా, ఆయన తెల్లవెంట్రుకల్లో ఒక్కటి కూడా కదలదని ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ప్రజల సొమ్ముని కోర్టు ఖర్చులకు దుబారా చేయకుండా, ఆ సొమ్ముతో తన పార్టీవారికి సభ్యత, సంస్కారాలు నేర్పితే మంచిదని హితవు పలికారు. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే, ఎక్కడో పెట్టుకున్నట్టు, మంత్రి పదవితో నాని ఏం చేస్తున్నాడో తెలియడం లేదని దివ్యవాణి అవాకులు చెవాకులు పేలారు.