ఒక దందా ఫినిష్, మరో దందా షురూ!

అనంతపురం నుంచి అమరావతికి నేషనల్ హైవే నిర్మాణం ఇప్పుడు రూటు మారింది. ఇదివరకు అమరావతి చుట్టూ ఉండే అవుటర్ రింగ్ రోడ్డులో కలిసేలా ప్రతిపాదించిన ఈ రహదారిని దారి మళ్లించారు. ఇప్పుడది చిలకలూరిపేట వద్ద…

అనంతపురం నుంచి అమరావతికి నేషనల్ హైవే నిర్మాణం ఇప్పుడు రూటు మారింది. ఇదివరకు అమరావతి చుట్టూ ఉండే అవుటర్ రింగ్ రోడ్డులో కలిసేలా ప్రతిపాదించిన ఈ రహదారిని దారి మళ్లించారు. ఇప్పుడది చిలకలూరిపేట వద్ద హైవేలో కలుస్తుంది. అలా మార్చడం వెనుక.. రకరకాల కారణాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అమరావతిలో రాజధాని ఉంటుందో లేదో అనే కోణంలోంచి మాత్రమే దీనిని అంతా చూస్తున్నారు. అయితే ఇది సరికొత్త రియల్ ఎస్టేట్ దందా షురూ కావడానికి నిదర్శనం అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబునాయుడు  పాలన మొదలు కాగానే.. అనంతపురం నుంచి అమరావతి వరకు మలుపుల్లేని సిక్స్ లైన్ హైవే నిర్మించేలా ప్రతిపాదించారు. ప్రభుత్వంలోని పెద్దలకు ముందే రోడ్డు ఎటునుంచి ఎటు వేస్తున్నారో తెలుసు గనుక.. ఆ రోడ్డు వెళ్లే చుట్టు పక్కల ప్రాంతాల్లో భూములు విస్తారంగా కొనుక్కున్నారని పుకార్లు వచ్చాయి.

హైవే ప్రకటన వచ్చిన వెంటనే.. భూములకు విపరీతంగా ధరలు పెరిగాయి. హఠాత్తుగా రియల్ ఎస్టేట్ మాయాజాలంలాగా తయారైంది. తెలుగుదేశం నాయకులు ఈ ప్రతిపాదిత హైవే ప్రాంతంలో భూములు కొని అమ్మకాలు సాగించడం ద్వారా వందల కోట్ల మేర లాభపడినట్లు గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు జగన్ సర్కారు వచ్చింది. ఆ హైవే  దారి మళ్లిపోయింది. రూటు మారిస్తే తప్ప.. కొత్త రియల్ ఎస్టేట్ దందా నడిపించడం సాధ్యం కాదు. ఇవాళ ఇలా రూటు మారిన ప్రకటన రావడానికంటె ముందు.. బహుశా కొత్తగా దందాలు మొదలెట్టిన వాళ్లు రూటు రాగల ప్రాంతంలో ఈసరికి భూముల కొనుగోళ్లు పూర్తిచేసి ఉన్నా ఆశ్చర్యం లేదు.

కానీ ఈ వ్యవహారానికి రాజధానితో ముడిపెడుతూ… హైవే రూటు మారుతున్నది గనుక.. రాజధాని మారిపోవచ్చుననే సంకేతంగా దానిని భావించాలని పుకార్లు పుడుతుండడం చిత్రం. హైవే వచ్చేస్తున్నదని ఇటువైపు ఎగబడితే.. మళ్లీ రూటు మారిపోయినా ఆశ్చర్యం లేదు.

పైగా రాజధాని ఎక్కడ ఉంటుందో.. ఎక్కడ కోర్ కేపిట్ నిర్మాణాలు చేపడతారో.. ప్రభుత్వం అధికారికంగా తేల్చేవరకు ఇలాంటి ఉచ్చులో చిక్కకుండా ఉండడమే ప్రజలకు మంచిది.