తాడికొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యే శ్రీదేవికి జాయింట్ కలెక్టర్ నుంచి నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆ నోటీసులు జారీ అయినట్టుగా సమాచారం. ఆమె కులం గురించి వివాదం రేగిన నేపథ్యంలో, ఆమె ఎస్సీ అని నిరూపించుకోవడానికి ఆధారాలు చూపించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
ఆమె ఎస్సీ కాదంటూ కొందరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రిజర్వడ్ నియోజకవర్గం నుంచి ఆమె నెగ్గిన సంగతి తెలిసిందే. ఎస్సీ కాకపోయినా, అక్కడ నుంచి పోటీ చేసి నెగ్గారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తను ఎస్సీనే అని ఆమె ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
అందుకు సంబంధించి ఆధారాలను ఇప్పుడు చూపించాలని ఎలక్షన్ కమిషన్ కోరుతూ ఉంది. అయితే రిజర్వడ్ నియోజకవర్గాల్లో నెగ్గిన వారి విషయంలో ఇలాంటి వివాదాలు కొత్త కావు. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు- ఎంపీల విషయంలో ఇలాంటి రచ్చలు జరిగాయి. కొన్ని కోర్టులకు వెళ్లాయి. ఇప్పుడు మరోటి తలెత్తింది.
ఈ నెల 26న శ్రీదేవి పూర్తి ఆధారాలను సమర్పించాలని ఈసీ ఆదేశించింది. ఒకవేళ ఆమె ఎస్సీ అని నిరూపించుకోలేని పక్షంలో అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి.