కుప్పం కౌంటింగ్‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

టీడీపీకి కుప్పం త‌ప్ప మిగిలిన‌వేవీ ప‌ట్టడం లేదు. ఎలాగైనా ఆ ఒక్క చోట గెలిస్తే చాల‌ని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల్లో నిన్న…

టీడీపీకి కుప్పం త‌ప్ప మిగిలిన‌వేవీ ప‌ట్టడం లేదు. ఎలాగైనా ఆ ఒక్క చోట గెలిస్తే చాల‌ని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల్లో నిన్న ఎన్నిక‌లు ముగిశాయి. కేవ‌లం కుప్పంలో మాత్ర‌మే ఓట్ల లెక్కింపు కోసం ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని టీడీపీ కోర్టుకెక్క‌డం ఆశ్చ‌ర్య క‌లిగిస్తోంది.

కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌లు మొద‌టి నుంచి ఉత్కంఠ క‌లిగిస్తున్నాయి. నువ్వానేనా అన్న‌ట్టు పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీలు ఢీకొన్నాయి. ఈ నేప‌థ్యంలో భారీగా దొంగ ఓట్లు ప‌డ్డాయ‌ని ఇరు పార్టీలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి. ఎస్ఈసీకి ఫిర్యాదు చేసుకున్నాయి. ఎన్నిక‌లు ముగిసినా కుప్పం పంచాయితీ కొన‌సాగుతూనే ఉంది.

కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై హైకోర్టులో లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచారించిన ఉన్న‌త న్యాయస్థానం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది.

ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డిని నియమించాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేయించాలని టీడీపీ అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ… ఆ మేర‌కు ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్య‌ర్థుల పిటిష‌న్‌ను ప‌రిశీలిస్తే కుప్పం మిన‌హా మిగిలిన అన్ని చోట్ల ఎన్నిక‌లు బాగా జ‌రిగిన‌ట్టు భావించాలి.