చంద్ర‌బాబు పోటీ చేయ‌బోయే నియోజ‌క‌వ‌ర్గం అదే?

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ విష‌యంలో కుప్పం మీద భ‌రోసాతో లేర‌నే క్లారిటీ రానే వ‌స్తోంది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనే టీడీపీ అక్కడ చిత్తు చిత్తు అయ్యింది. ఇక కుప్పం…

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ విష‌యంలో కుప్పం మీద భ‌రోసాతో లేర‌నే క్లారిటీ రానే వ‌స్తోంది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనే టీడీపీ అక్కడ చిత్తు చిత్తు అయ్యింది. ఇక కుప్పం మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకోవ‌డం కూడా గ‌గ‌నంగా మారింది. ఇప్ప‌టికే పోలింగ్ పూర్త‌యిన నేప‌థ్యంలో.. ఫ‌లితాలు టీడీపీకి ఏ మేర‌కు సానుకూల‌గా ఉంటాయ‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌నుకుంటే.. ఇప్ప‌టికే టీడీపీ శ్రేణుల స్పంద‌న మ‌రోలా ఉండేది. ప్ర‌జాస్వామ్యం గెలుస్తుంద‌నే వారు. ఎలాగూ సీన్ ఎత్తిపోతుంద‌నే లెక్క‌ల‌తో అక్ర‌మాలు, ఎస్ఈసీ రాజీనామా చేయాల‌నే మాట‌లు టీడీపీ వైపు నుంచి వ‌స్తున్నాయి. ఇదీ కుప్పంలో టీడీపీ ప‌రిస్థితి.

కుప్పంలో టీడీపీ కూసాలు క‌దిలిపోయాయి.. ఎంత‌లా అంటే, ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడుకు ఆ క్లారిటీ కూడా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఆఫ్ ద రికార్డుగా అందుతున్న స‌మాచారం ఏమిటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయాల‌నుకుంటున్నార‌నేది! సొంత జిల్లాలో ఎదుర‌వుతున్న తిర‌స్క‌ర‌ణ‌ల నేప‌థ్యంలో.. ఆయ‌న అత్త‌గారి జిల్లాకు మార‌నున్నార‌నే మాట వినిపిస్తోంది. అందుకు గానూ పెన‌మ‌లూరు నియోజ‌క‌వర్గం వైపు చంద్ర‌బాబు చూస్తున్నార‌నేది ఆఫ్ ద రికార్డు స‌మాచారం.

పెన‌మ‌లూరు మీద చంద్ర‌బాబుకు ఇప్పుడు ఆశ‌లున్నాయ‌ట‌. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే పెన‌మ‌లూరు నుంచి నారా లోకేష్ పోటీ చేస్తార‌నే టాక్ వ‌చ్చింది. అయితే అన్ని లెక్క‌లూ వేసి మంగ‌ళ‌గిరికి మార్చారు. ఇక పెన‌మ‌లూరు అయినా లోకేష్ గెలిచేవాడ‌ని అనుకోవ‌డం భ్ర‌మే. అక్క‌డ కూడా టీడీపీ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 వేల మెజారిటీని సాధించింది. ఒక‌వేళ లోకేష్ పోటీ చేసి ఉంటే.. ఆ మెజారిటీ కొంత త‌గ్గినా విజ‌యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అయ్యేద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

ఇక రాజ‌కీయ జీవిత చ‌ర‌మాకంలో నియోజ‌క‌వ‌ర్గం మారిన నేత‌గా అప‌కీర్తిని పొంద‌డం కూడా చంద్ర‌బాబుకు త‌ప్పేలా లేదు. కుప్పంలో పోటీ చేసి ఓడిపోవ‌డం క‌న్నా.. పెన‌మ‌లూరు వెళ్లి ప‌రువును వెదుక్కోవ‌డమే బెట‌రని అనుకుంటారేమో. ప్ర‌స్తుతం పెన‌మ‌లూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొలుసు పార్థ‌సార‌ధి ఎమ్మెల్యేగా ఉన్నారు.  

సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల లెక్క‌ల్లో మాత్రం ఇది టీడీపీ అనుకూల నియోజ‌క‌వ‌ర్గంగా పేరుంది. అయితే అలాంటి కంచుకోట కూడా గ‌త ఎన్నిక‌ల్లో కూలింది. అక్క‌డే ఇప్పుడు చంద్ర‌బాబు అడుగెడ‌తార‌ట‌!