యూపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ గణనీయంగా బలపడిందన్న సర్వేల అంచనాల నేపథ్యంలో.. యూపీ వ్యవహారాలు ఆసక్తిదాయకంగా మారుతున్నాయి. 2024లో జరగనున్న లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను బాగా ప్రభావితం చేయగల అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ వి.
ఏకంగా 80 లోక్ సభ సీట్లున్న ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఊపు ఎంత ఉంటుందనేది బట్టి.. వచ్చే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలం పట్ల ప్రత్యర్థులు కూడా ఒక అంచనాకు రావొచ్చు.
ఒకవైపు మోడీ ప్రభుత్వం రెండో దఫా పాలనలో ఉంది. ప్రజా వ్యతిరేకత ప్రబలే టైమ్ సరిగ్గా ఇదే. యూపీఏ విషయంలో కూడా.. రెండో పర్యాయంలో రెండో యేడు గడిచిన తర్వాతే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇక ఏడు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న తర్వాత కూడా.. మోడీ మాటలు కాంగ్రెస్ ను నిందించడం మీదే సాగుతున్నాయి.
నిన్న ఒక సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. గిరిజనుల వెనుకబాటు తనానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని సెలవిచ్చారు. కాంగ్రెస్ సరే.. ఏడేళ్లలో బీజేపీ ఏం చేసిందనేది ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారని బీజేపీ అధినాయకత్వం ఇంకా గుర్తించలేదు కాబోలు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గో మూత్రమే పరిష్కారం అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సెలవిచ్చారు. యూపీ ముఖ్యమంత్రేమో.. ఇంకా నగరాల పేర్లను మార్చడం మీదే దృష్టి పెట్టారు. ఆ మార్చేదేదో ఒక రోజులో యూపీలోని నగరాల పేర్లన్నింటినీ మార్చేయొచ్చు. అయితే.. ఒక్కో ఊరికి ఒక్కోసారి పేరు మార్పు ద్వారా.. ప్రజల్లో ఏవో ఉద్వేగాలు రేకెత్తించాలని ఐదేళ్లూ ఇదే పని చేపట్టినట్టుగా ఉన్నారు.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. యూపీలోనే బీజేపీ ఏకంగా వంద సీట్లను అలవోకగా కోల్పోతుందని, సమాజ్ వాదీ పార్టీ గణనీయంగా పుంజుకుంటుందన్న వార్తల నేపథ్యంలో రాజకీయ వేడి రగులుకుంటోంది. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ ఎస్పీ బలోపేతం కావడమే జరిగితే, అది మరింతగా జరగొచ్చు. ఎస్పీనే పుంజుకోవడం అంటూ జరిగితే.. అది 160 సీట్లతో ఆగుతుందా, లేక దాని బలం మరింత పెరుగుతుందా.. అనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు.
మరోవైపు రానున్న నాలుగు నెలల్లో .. బీజేపీ దృష్టంతా యూపీ మీదే పెట్టనుందట. కేంద్రమంత్రులు, బీజేపీ దళాలన్నీ యూపీ వైపు మొహరిస్తున్నాయి. అధికారిక, అనధికారిక కార్యక్రమాలతో యూపీని బీజేపీ నేతలంతా రౌండప్ చేయనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ ని గట్టిగా ప్రభావితం చేయనున్న నేపథ్యంలో.. రాజకీయం రసకందాయకంలో పడుతోంది.