ఏపీలో క్రిస్టియానిటీ కొత్తగా పుట్టిందా.?

ఇంగ్లీషు మీడియమ్‌కీ, క్రిస్టియానిటికీ అనూహ్యంగా లింకులు పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనే క్రమంలో, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతోపాటు, మరో విపక్షం జనసేన…

ఇంగ్లీషు మీడియమ్‌కీ, క్రిస్టియానిటికీ అనూహ్యంగా లింకులు పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనే క్రమంలో, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతోపాటు, మరో విపక్షం జనసేన పార్టీదీ ఒకటే పద్ధతిలా కన్పిస్తోంది.

ఆ మాటకొస్తే, టీడీపీ, జనసేనలకన్నా టీడీపీ అనుకూల మీడియాకి చెందిన ఓ మీడియా సంస్థ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

నిజానికి, కులం.. మతం.. ప్రాంతం.. ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు. దురదృష్టవశాత్తూ అవిప్పుడు చాలా తేలిగ్గా వివాదాస్పద అంశాలవుతున్నాయి. ఆయా అంశాల చుట్టూ బోల్డంత పబ్లిసిటీ దొరుకుతుండడంతో రాజకీయ పార్టీలే కాదు, మీడియా సంస్థలూ ఓ రేంజ్‌లో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం గమనార్హం. ఇంగ్లీషు మీడియం అనేది ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో అవతరించింది కాదు.. క్రిస్టియానిటీ కూడా అంతే.

అక్కడికేదో, ఇప్పుడే కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో పుట్టుకొచ్చిందనీ, దానికి కారణం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డే అన్నట్టు నానా యాగీ చేస్తున్నాయి టీడీపీ, జనసేన. సందట్లో సడేమియా.. అన్నట్లు ఈ వ్యవహారంపై బీజేపీ నేతలూ తమదైన స్టయిల్లో యాగీ చేస్తున్నారు. మత మార్పిడులు, బలవంతపు మత మార్పిడులు గతంలో కూడా జరిగాయి.. జరుగుతూనే వున్నాయి.

క్రిస్టియన్‌ మిషనరీ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంకి ఓ ప్రత్యేకత వుంది. అలాగని, అలాంటి స్కూళ్ళన్నీ మత మార్పిడుల్ని ప్రోత్సహిస్తాయనుకుంటే పొరపాటే. కేవలం సేవా భావంతో పనిచేసే మిషినరీ స్కూల్స్‌ ఎన్నో వున్నాయి.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్రిస్టియన్‌ గనుక.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇంత స్థాయిలో క్రిస్టియానిటీపై రచ్చ జరుగుతోంది. నిజానికి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కూడా ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తిన మాట వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఆ మటకొస్తే దేశ వ్యాప్తంగా.. గడచిన రెండు దశాబ్దాల్లో చాలా మార్పులొచ్చాయి.. ఈ మత మార్పిడుల విషయంలో. అదో ప్రసహనం.

దానికీ, ఇంగ్లీషు మీడియంకీ లింకు పెట్టి, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటే అంతకన్నా దారుణం ఇంకోటుండదు. కానీ, విపక్షాలు ఈ విషయంలో పూర్తిగా ఇంగితం కోల్పోతున్నాయి.

వ్యవహారం 'మత కల్లోలాల' చర్చదాకా వెళ్ళిందంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.