టీడీపీ క‌థ అయిపోయిందన్న అమిత్ షా

ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మం కోసం ఏపీకి వ‌చ్చి, ప‌నిలో ప‌నిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీ విభాగం ముఖ్య నేత‌లు, శ్రేణుల‌తో కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ నేత అమిత్ షా జ‌రిపిన…

ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మం కోసం ఏపీకి వ‌చ్చి, ప‌నిలో ప‌నిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీ విభాగం ముఖ్య నేత‌లు, శ్రేణుల‌తో కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ నేత అమిత్ షా జ‌రిపిన స‌మావేశంలో, ఆయ‌న కొన్ని ఆస‌క్తిదాయ‌క‌మైన వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా స‌మాచారం అందుతోంది. 

ఒక‌వైపు భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు కోసం టీడీపీ పాకులాడుతున్న నేప‌థ్యంలో.. టీడీపీపై అమిత్ షా ఘాటైన వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ప‌ని అయిపోయింద‌ని అమిత్ షా వ్యాఖ్యానించిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాదు తెలుగుదేశం పార్టీ నాయ‌క‌త్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంద‌ని కూడా అమిత్ షా బీజేపీ శ్రేణుల‌తో అన్నారు.

తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితితో ఏపీలో రాజ‌కీయ శూన్య‌త ఏర్ప‌డింద‌ని.. ఈ ప‌రిస్థితుల్లో సొంతంగా ఎద‌గ‌డం గురించి ప‌ని చేయాల‌ని అమిత్ షా త‌మ పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్టుగా స‌మాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌మ‌కు ఏమీ బంధువు కాద‌ని ఆ పార్టీతో కూడా ఎడంగా ఉంటూ సొంతంగా ఎద‌గ‌డం మీద దృష్టి పెట్టాల‌ని.. టీడీపీ ప‌రిస్థితి దృష్ట్యా ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా బీజేపీనే ఎదిగేందుకు ప్ర‌య‌త్నించాల‌ని షా ప్ర‌ధానంగా చేసిన ఉద్భోధ‌గా తెలుస్తోంది.

అమిత్ షా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఇటీవ‌లి ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసుకున్న ఫోన్ కాల్ ప్ర‌చారం లో డొల్ల ఎంత ఉందో కూడా క్లారిటీ వ‌స్తోంది. అమిత్ షా  ఏపీకి వ‌చ్చినా.. చంద్ర‌బాబు నాయుడు క‌నీసం క‌లిసే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోయారు. 

అధికారిక హోదాతో అయినా చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌తో స‌మావేశానికి ఆస్కారం ఉంది. అయితే అలా వెళ్లినా అమిత్ షా ఎలా అవ‌మానిస్తారో అని చంద్ర‌బాబు నాయుడు భ‌య‌ప‌డిన‌ట్టుగా ఉన్నారు. అందుకే అమిత్ షా ఏపీకి వ‌చ్చి వెళ్లార‌నే అంశం తెలియ‌న‌ట్టుగా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తూ ఉంది. 

టీడీపీతో బీజేపీకి పొత్తు కుద‌ర్చ‌డానికి కొన్ని ప్ర‌య‌త్నాలు అయితే సాగుతున్నాయ‌నేది వాస్త‌వం. బీజేపీలో చేరిన చంద్ర‌బాబు నాయుడు చంచా నేత‌లు కొంద‌రు ఇలాంటి ప్ర‌చారానికి ఆస్కారం ఇచ్చారు. 

బీజేపీకి ఇంకో దిక్కులేద‌నే భావ‌న కొత్త‌గా కాషాయ చొక్కా త‌గిలించుకున్న ఆ నేత‌లు క‌లిగించ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే టీడీపీ ప‌నే అయిపోయింద‌ని.. అమిత్ షా వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో, టీడీపీ నాయ‌క‌త్వ సంక్షోభంలో కూరుకుపోయింద‌న్న ఆయ‌న విశ్లేష‌ణ నేప‌థ్యంలో బీజేపీతో పొత్తు కు టీడీపీ ఇంకా ఏ త‌ర‌హాలో సాగిలా ప‌డుతుందో!