టాలీవుడ్ లో ఇప్పుడు విపరీతంగా మీటింగ్ లు, ఫోన్ కాల్స్, మల్లగుల్లాలు..అన్నీ ఒక్క దాని గురించే…అదే భీమ్లా నాయక్. ఈ సినిమా జనవరి 12న విడుదలను ఎలాగైనా ఆపాలనే ప్రయత్నాలు టాలీవుడ్ నలు మూలల నుంచీ సాగుతున్నాయి. ఈ సినిమా విడుదల అయితే ఇటు ఆర్ఆర్ఆర్, అటు రాధేశ్యామ్ సినిమాలు రెండింటికీ ఇంతో అంతో నష్టం చేస్తుందని, అందువల్ల రాకుండా చూడాలని టాలీవుడ్ లోని పెద్దలందరూ రంగంలోకి దిగినట్లు బోగట్టా.
ఆర్ఆర్ఆర్ కు ఒక మద్దతు కాదు. రెండు మద్దతులు కావు. అన్నీ వున్నాయి. ఎన్టీఆర్ క్యాంప్, మెగా క్యాంప్, దాన్ని నైజాం ఏరియాకు 65 నుంచి 70 కోట్ల మేరకు కొన్న దిల్ రాజు క్యాంప్, ఇంకా చాలా చాలా మంది వున్నారు. వీరంతా కలిసి భీమ్లా నాయక్ మెడలు వంచి వెనక్కు పంపాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే ఇటు అల్లు అరవింద్ తో, అటు దిల్ రాజుతో వ్యాపార భాగస్వామ్యలు వున్న యువి వంశీ నిర్మిస్తున్న రాధేశ్వామ్ కు కూడా భీమ్లా నాయక్ వాయిదా అవసరం వుంది. అందువల్ల అట్నుంచి కూడా నరుక్కు వస్తున్నారు.
నిజానికి చాలా రోజుల ముందే 2022 సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట, పవన్ భీమ్లా నాయక్, డేట్ లు వేసారు. తరువాత రాధేశ్యామ్ వచ్చి చేరింది. అప్పట్లో ఆర్ఆర్ఆర్ డేట్ అన్నది వేరు. సంక్రాంతికి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ వచ్చి పడింది. దాంతో సర్కారు వారి పాట వెనక్క వెళ్లిపోయింది. భీమ్లా నాయక్, రాదేశ్యామ్ వుండిపోయాయి.
ఇప్పుడు భీమ్లాను కూడా వెనక్కు పంపాలని ప్రయత్నాలు. ఇది తెలిసి హీరో పవన్ కళ్యాణ్ నిర్మాత నాగవంశీని అడిగినట్లు తెలుస్తోంది. జనవరి రావడానికి ఇబ్బంది ఏమిటని, అంత ఇబ్బంది అంటే ఓటిటికి ఇచ్చేసుకోమని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో థియేటర్ కే వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.
ఇది తెలిసిన దగ్గర నుంచి అన్ని వైపుల నుంచి నాగవంశీ మీద ప్రెజర్ పెరిగింది. ఇండస్ట్రీని నాశనం చేసేస్తారా? ఇలా చేస్తే ఎలా అంటూ నిలదీయడం మొదలైంది. చిత్రమేమిటంటే వున్నట్లుండి ఊడిపడిన ఆర్ఆర్ఆర్ ను ఎవ్వరూ అడగడం లేదు. రాజమౌళి లాంటి డైరక్టర్ కు, ఎన్టీఆర్-చరణ్ లాంటి మల్టీస్టారర్ సినిమాకు సంక్రాంతి లాంటి సీజన్ అవసరమా? మరి అలాంటి సినిమాకే సంక్రాంతి అవసరమైతే, భీమ్లా నాయక్ కు అవసరం కాదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
భీమ్లా నాయక్ నే వెనక్కు వెళ్లాలా? నాగ్ బంగార్రాజుకు సమస్య లేదు. ప్రభాస్ రాధేశ్యామ్ కు సమస్య లేదు. భీమ్లాతోనే సమస్యా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఏది ఏమైనా జనవరి 12నే రావాలన్నది భీమ్లా నాయక్ డెసిషన్. ఇప్పుడు వెనక్కు వెళ్తే, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, నాగార్జునలకు జంకి పవన్ వెనకంజ వేసినట్లు వస్తుంది. పవన్ ఫ్యాన్స్ మామూలుగా తిట్టరు.
ఇదిలా వుంటే అఖండ నుంచి పెద్ద సినిమాలు వస్తున్నందున టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. భీమ్లా నాయక్ కనుక బరిలో వుందని తెలిస్తే ఆంధ్ర ప్రభుత్వం రేట్లు ఇవ్వదేమో అన్న అనుమానాలు ఇండస్ట్రీ పెద్దల్లో వున్నాయి. అందుకోసం కూడా భీమ్లాను వెనక్కు వెళ్ల మంటున్నారు. ఇస్తే అందరికీ ఇస్తారు కదా రేట్లు, అంతే కానీ భీమ్లా వెనక్కు వెళ్తే, తరువాత ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటి? అందుకోసం అయినా సంక్రాంతి బరిలోకే దిగాలనుకుంటున్నారు.
మొత్తం మీద ఇన్ని మల్లగుల్లాలు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ కానీ, నిర్మాతలు కానీ ఈ వత్తిడికి తల వొగ్గడం లేదు. సంక్రాంతి బరిలోనే దిగుతున్నారని తెలుస్తోంది.