విశాఖలో మావోయిస్టుల కార్యకలాపాలు రెండేళ్ళుగా పెద్దగాలేవు. 2018 చివరలో అప్పటి అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ని మావోలు దారి కాచి అటకాయించి మరీ మట్టుబెట్టారు. ఆ తరువాత వారి అయిపూ అజా పెద్దగా లేదు.
ఓ విధంగా చెప్పుకోవాలంటే మావోలు తగ్గిపోయారని, ఉద్యమం బలహీనమైందని ప్రచారంలో ఉంది. అయితే ఇపుడు అంతా ఉలిక్కిపడే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబుకు మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉందని.
ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు జగన్ ప్రభుత్వం ఆయనకు పటిష్టమైన భద్రతను కల్పించింది. అంతే కాదు, బుల్లెట్ ప్రూవ్ వాహనాన్ని సమకూర్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబు వైసీపీ నుంచి గెలిచిన తరువాత అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖను జగన్ కట్టబెట్టారు. ఆయన డైనమిక్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్నారు.
పాలనారాజధాని కాబోతున్న విశాఖకు ఆయన ఇన్చార్జి మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మావోల కదలికలు ఎక్కువగా విశాఖ ఏజెన్సీలోనే ఉంటాయి. మరి మంత్రి పర్యటనకు వచ్చినపుడు ఆయనను టార్గెట్ చేయాలనుకున్నారో ఏమో కానీ ఇంటలిజెన్స్ కి అత్యంత కీలకమైన సమాచారం వచ్చింది. అంతే సాధారణ కారులో తిరుగుతూ అందరితోనూ కలసిపోయే కన్నబాబుకు అనూహ్యంగా భద్రత పెరిగింది.
పూర్వాశ్రమంలో విశాఖలో పాత్రికేయునిగా పనిచేసిన మంత్రి ఎందుకు మావోల టార్గెట్ గా ఉన్నారన్నది అతుపట్టని విషయమే. అయితే సంచలనాలు చేయాలనుకున్నపుడు మావోలు అతి ముఖ్యులనే టార్గెట్ చేస్తారు. ఏది ఏమైనా మావోల పెద్ద నాయకుడు గణపతి ఓ వైపు లొంగుతారని వార్తలు వస్తున్న వేళ ఇలాంటి సమాచారం రావడం ఒక విధంగా పోలీసులకు సవాల్ లాంటిదే.