అమరావతి ఉద్యమంలో పాల్గొనాల్సిందేనంటూ కేంద్ర మంత్రి అమిత్ షా.. ఏపీ బీజేపీ శ్రేణులకు ఉపదేశమిచ్చారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే పరోక్షంగా కేంద్రం మద్దతు అమరావతికేనని, మూడు రాజధానులకు కేంద్రం వ్యతిరేకంగా ఉందనే సందేశాన్ని జనాల్లోకి పంపడమే ఈ కథనం సారాంశం.
అమిత్ షా ఆ మాట అన్నారో లేదో తెలియదు కానీ.. ఈనాడులో మాత్రం బ్యానర్ పెట్టేశారు. అమరావతి ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని బీజేపీ నేతలకు అమిత్ షా తేల్చి చెప్పారని రాసుకొచ్చారు. పార్టీ తీర్మానం చేశాక వెనకడుగు వేయడం ఎందుకని అమిత్ షా చెప్పినట్టు ఆ కథనం సారాంశం.
వీర్రాజు ఎందుకు చెప్పలేదు..?
అమిత్ షా పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. చేరికల విషయాన్ని హైలెట్ చేశారు కానీ, అమరావతిపై నోరు మెదపలేదు. నిజంగా అమిత్ షా ఆదేశం అదే అయితే.. కచ్చితంగా వీర్రాజు ఆ విషయాన్ని ప్రస్తావించేవారు కదా. ఇకపై అమరావతి ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు అని ప్రకటించేవారు కదా..?
లాజిక్ ఎక్కడ మిస్ అయింది..?
అమరావతిని టీడీపీయే ఓ దశలో అటకెక్కించింది. మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది వస్తుందనే కారణంతో అమరావతి ఉద్యమానికి దూరంగా ఉంది. ఈ దశలో అసలు ఏ ప్రాంతంలోనూ బలపడని బీజేపీ అమరావతిని ఎందుకు హైలెట్ చేస్తుంది..? అమరావతి ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు తెలిపితే.. మిగతా చోట్ల ఆ పార్టీ పురిటిలోనే చచ్చిపోయినట్టే కదా..? మరి అమిత్ షా అంతమాట అనే ఉంటారా.. అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
అమిత్ షా తో జరిగిన మీటింగ్ లో.. అమరావతి ఉద్యమం గురించి ఓ కీలక నేత ప్రస్తావించారట, మరో కీలకనేత అది టీడీపీ నడిపిస్తోందని చెప్పారట. దానికి అమిత్ షా స్పందిస్తూ.. పార్టీ తీర్మానం ప్రకారం అమరావతికి బీజేపీ మద్దతివ్వాల్సిందేనని తేల్చి చెప్పారట. ఒక రకంగా అమిత్ షా పేరు అడ్డు పెట్టి.. అమరావతిని హైలెట్ చేయడానికి టీడీపీ అనుకూల మీడియా చేసిన కుటిల ప్రయత్నమే ఇది.
బీజేపీ రంగంలోకి దిగితే.. మరి టీడీపీ పరిస్థితి..
ఒకవేళ బీజేపీ పూర్తి స్థాయిలో అమరావతికి మద్దతిస్తే మరి ఉద్యమాన్ని వెనకుండి స్పాన్సర్ చేస్తున్న టీడీపీ ఏం కావాలి..? ఉద్యమానికి బీజేపీని బలిచేసి, తాను మాత్రం ఫలితం కోసం ఎదురు చూడాలనేది ఆ పార్టీ ఆలోచన. అందుకే అటు మింగలేక, ఇటు కక్కలేక అవస్థలు పడుతోంది.
ప్రస్తుతం బాబు మద్దతు తెలపాల్సింది సేవ్ అమరావతి యాత్రకు కాదు… సేవ్ కుప్పం యాత్రకు. కుప్పంలో టీడీపీని కాపాడుకునే యాత్రకు బాబు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.