విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన యువతిపై పెట్రోల్ దాడి ఘటనలో యువకుడు మరణించాడు. తీవ్రమైన కాలిన గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హర్షవర్థన్, ఈరోజు ఉదయం మృతిచెందాడు.
నిన్నటివరకు అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. ఛాతిపై ఎక్కువ భాగం కాలడంతో, ఆకస్మికంగా ఊపిరితిత్తుల్లో సంభవించిన మార్పుల వల్ల అతడు మరణించినట్టు తెలుస్తోంది. యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది.
విశాఖకు చెందిన అమ్మాయి, తెలంగాణలోని భూపాలపల్లి ప్రాంతానికి చెందిన హర్షవర్థన్ ఒకే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. కాలేజ్ డేస్ లోనే అమ్మాయిని ప్రేమించాడు హర్షవర్థన్. కానీ యువతి నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని, ఉద్యోగం కూడా సంపాదించుకుంది యువతి. హర్షవర్థన్ మాత్రం అమ్మాయిని మరిచిపోలేకపోయాడు. మరోసారి తన ప్రేమను వ్యక్తం చేసేందుకు వైజాగ్ వచ్చాడు.
ఈసారి యువతి అంగీకరించకపోతే అమ్మాయిని హత్య చేసి, తను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రీ-ప్లాన్డ్ గా పెట్రోల్ కొనుగోలు చేసి తనతో పాటు పెట్టుకున్నాడు. హర్షవర్థన్ ను కలిసేందుకు హోటల్ గదికి వచ్చింది యువతి. ఇద్దరి మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. మరోసారి హర్షవర్థన్ ప్రేమను యువతి నిరాకరించింది.
దీంతో కోపం తెచ్చుకున్న హర్షవర్థన్ తనతో పాటు తెచ్చుకున్న పోట్రోల్ ను యువతిపై పోసి నిప్పంటించాడు. తర్వాత తను కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కాస్త ఆలస్యంగా స్పందించిన స్థానికులు, ఇద్దర్నీ కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా హర్షవర్థన్ పై మర్డర్ కేసు, ఆత్మహత్య యత్నం కేసు నమోదుచేశారు దిశ పోలీసులు. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్న టైమ్ లో హర్షవర్థన్ మృతి చెందాడు.