ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు ఒకరికి మించి మరొకలు నాటకాలాడుతున్నారు. అందరూ నాటకాల్లో పాత్రధారులని ప్రజలకు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బహుశా ప్రజాస్వామ్య దుస్థితిగా భావించాలేమో.
ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో భారతీయ జనతాపార్టీ ఆడుతున్న నాటకాలకు ఆకాశమే హద్దు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రాజధాని ఎంపిక అంశం రాష్ట్ర పరిధిలోనిదని, దాని విషయంలో జోక్యం చేసుకోలేమంటూ ఒకటికి రెండు సార్లు హైకోర్టులో బీజేపీ పాలనలోని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
మరోవైపు ఏపీ బీజేపీ మాత్రం అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, ఒక రాజకీయ పార్టీగా అమరావతిలోనే రాజధాని కొనసాగాలని తీర్మానించింది. తాజాగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్‌పై ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షా తన పార్టీ రాష్ట్రశాఖకు దిశానిర్దేశం చేసినట్టు వార్తలొచ్చాయి.
భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా పార్టీ తీర్మానం చేశాక దీనిపై మరో అభిప్రాయం ఎందుకొస్తుందని ఆయన ప్రశ్నించారని సమాచారం. ఏపీ పర్యటనలో భాగంగా చివరి రోజు తిరుపతిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితర నాయకులతో తిరుపతిలో అమిత్‌షా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఒక నాయకుడు అమరావతి ఉద్యమాన్ని ఒక పార్టీ చేయిస్తోందని ప్రస్తావించడానికి ప్రయత్నించగా రైతులు భూములిచ్చారా లేదా? ఉద్యమిస్తోంది రైతులా కాదా? పాల్గొంటోంది రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకు? పాదయాత్రలో పాలు పంచుకోవాలి అని ఆయన ఆదేశించినట్టు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఒకవైపు రాజధాని ఎంపికతో తమకు సంబంధమే లేదని తెగేసి చెప్పి, మరోవైపు ఏ మొహం పెట్టుకుని రైతుల పాదయాత్రలో పాల్గొంటారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం తమ పాదయాత్రకు సంఘీభావంగా పాల్గొంటే చాలు అని అమరావతి రైతులు భావిస్తే… చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే దాని వల్ల అమరావతిలోనే రాజధాని కొనసాగదు కాబట్టి. తమ పాదయాత్రలో బీజేపీ పాల్గొనడమే కావాలా లేక అమరావతి కావాలా? అని తేల్చుకోవాల్సింది పాదయాత్ర నిర్వాహకులే. చూద్దాం ఏం చేస్తారో!