మాయలోళ్లనే మాయ చేస్తే ఎంతైనా ఆ కిక్కే వేరబ్బా. గత నాలుగు దశాబ్దాలుగా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మైండ్‌గేమ్ ఆడుకున్న ఘనత చంద్రబాబుకే దక్కింది. తాడిని తన్నే వాడుంటే వాడి తలతన్నే వాడుంటాడనే చందాన మారిన కాలమాన పరిస్థితుల్లో చంద్రబాబు అనే మహామాంత్రికుడి ఆటకట్టించేందుకు జగన్ రూపంలో ఓ నాయకుడు దొరికాడు. తల తన్నే వాడంటే ఎలాగుంటాడో బహుశా ఇప్పుడు చంద్రబాబుకు అనుభవంలోకి వచ్చి ఉంటుందేమో!
ఇప్పుడు ఎల్లో మీడియా గగ్గోలు, చంద్రబాబు అరుపులకు కాలం చెల్లింది. ఎన్నికలంటేనే చంద్రబాబు గజగజ వణికిపోయే పరిస్థితిని జగన్ తీసుకొచ్చారు. అత్యంత ప్రజాదరణ నేత, తన మామ ఎన్టీఆర్‌ను సైతం బోల్తా కొట్టించిన చంద్రబాబుకు… ఇప్పుడు జగన్‌ను ఎదుర్కోవడం సాధ్యం కావడం లేదు. అందుకే తన రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గమైన సీఎంను చూడలేదని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు పదేపదే అనడం.
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో గెలుపుపై సందేహం వచ్చే వరకూ చంద్రబాబు తీసుకొచ్చారంటే…. జగన్ సాధించిన విజయం సామాన్యమైంది కాదు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా…. ఇంత వరకూ జరిగిన ఎపిసోడ్‌ను గమనిస్తే చంద్రబాబులో మొదటిసారి ఎప్పుడూ లేనంత భయాన్ని చూడొచ్చు.
ఓ చిన్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం, తన కుమారుడిని పంపడం, రోజుకు మూడు సార్లు పర్యవేక్షించడం, అలాగే పార్టీ ముఖ్య నేతలను అక్కడే తిష్ట వేయించడం చంద్రబాబు పరాజయానికి నిదర్శనం కాక మరేంటి? బాబుతో వైసీపీ మైండ్‌గేమ్ చూడ ముచ్చటగా ఉందనేది జనం టాక్. ఎందుకంటే ఇంత కాలం అందరితో మైండ్‌గేమ్ తనకు మాత్రమే తెలిసిన విద్య అని ముసిముసి నవ్వు నవ్వే చంద్రబాబు, ఎల్లో మీడియాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో చుక్కలు చూపించారు.
2024లో అధికారంలోకి రావడం పక్కన పెడితే…. అంతకంటే ముందే కుప్పంలో భవిష్యత్ లేదనే దుస్థితి ఎదురుకావడంపై టీడీపీ, ఎల్లో మీడియా కలవరపడుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పైగా కంచుకోటగా భావిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇక కుప్పం మాత్రమే మిగిలి ఉంది. అక్కడ కూడా పాగా వేస్తే విజయం పరిపూర్ణమవుతుందని వైసీపీ భావిస్తోంది. మరోవైపు కుప్పంలో ఓడిపోతే రాష్ట్రమంతా ఓడినట్టే అని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.
ఏది ఏమైనా కుప్పం మున్సిపల్ ఎన్నికల తంతు ముగిసింది. ఇక ఫలితం తేలాల్సి వుంది. ఫలితం టీడీపీకి ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నాఈ ఆలోచనే చంద్రబాబు, టీడీపీ శ్రేణులకు నిద్రలేకుండా చేస్తోంది. చంద్రబాబు లాంటి అపరచాణక్యుడికి రాజకీయ చరమాంకంలో ఇలాంటి దుర్భర స్థితి ఎదురవుతుందని బహుశా ఏ రాజకీయ నేత కలలో కూడా ఊహించి వుండరేమో! ప్రతి చెడుకు జగనే కారణమనే విమర్శించే పచ్చ దళం మున్ముందు ఓటములపై ఏం చెప్తుందో!