ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనే జీవో నంబర్-1 పుట్టడానికి కారణమైంది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారుల్లో బహిరంగ సభలు పెట్టొద్దని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో, స్థలాలలో సభలు పెట్టుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. అయితే ఇది తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది.
ఈ జీవోను సవాల్ చేస్తూ చంద్రబాబునాయుడు ఆప్త మిత్రుడు, సీపీఐ నాయకుడు కె.రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ జీవోపై జస్టిస్ బట్టు దేవానంద్ బెంచ్ స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
జీవో నెం.1 పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల23న జీవో నెం 1పై హైకోర్టు విచారణ జరపాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ జరపాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారించే అధికారం వెకేషన్ బెంచ్‌కు లేదని సుప్రీంకోర్టు దృష్టికి ఏపీ సర్కార్ తరపు న్యాయవాది తీసుకెళ్లారు. తనకు లేని అధికారాన్ని ఉపయోగించుకుని వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పిందని ప్రభుత్వం వాదించింది.
అయితే కేసు మెరిట్స్ విషయానికి తాము వెళ్లదలచుకోలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని చీఫ్ జస్టిస్ బెంచ్ పేర్కొంది. ఈ నెల 23న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏవైనా వుంటే అక్కడే చెప్పుకోవాలని ఇరువురికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.