ఆమధ్య బెంగళూరులోని కొన్ని స్కూల్స్ లో పిల్లల స్కూల్ బ్యాగ్ లు తనిఖీ చేస్తే కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు బయటపడ్డాయి. యాజమాన్యాలు షాకయ్యాయి. ఆ తర్వాత మిగతా స్కూల్స్ లో కూడా తనిఖీలు జరిగాయి. సిగరెట్లు, లైటర్లు అబ్బో.. ఆ ఛండాలం అంతా ఇంతా కాదు. ఆ దెబ్బతో కర్నాటకలో ప్రైవేట్ స్కూల్స్ రూల్స్ మరింత స్ట్రిక్ట్ చేశాయి. కర్నాటక అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ స్కూల్స్ (KAMS) కూడా విద్యార్థుల స్కూల్ బ్యాగులను క్రమం తప్పకుండా పరిశీలించాలని పాఠశాలల యాజమాన్యాలను కోరింది.
అయితే అక్కడితో ఆ కథ అయిపోలేదు. ఇంత విచ్చలవిడిగా పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు ఎలా వచ్చాయి. అసలు మెడికల్ షాపుల్లో చిన్న పిల్లలకు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు ఎలా అమ్ముతున్నారని ఆరా తీశారు. మైనర్లకు వీటిని అమ్మే విషయంలో మెడికల్ షాపులపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో విక్రయాలు జరుగుతున్నాయని తేలింది.
స్కూల్ పిల్లలు కూడా విచ్చలవిడిగా కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారని తేలడంతో మీడియా ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వం మైనర్లకు ఇలాంటి వాటిని అమ్మే విషయంలో కఠిన నిర్ణయం తీసుకుందని నిషేధం విధించిందనే వార్తలొచ్చాయి.
ఆ నిషేధం వార్తలు వైరల్ కావడంతో చివరకు ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మైనర్లకు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు అమ్మడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తేల్చేసింది కర్నాటక సర్కార్. నిషేధం విషయంలో మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని చెప్పింది. దీంతో ఇప్పుడీ విషయం మరింత వైరల్ గా మారింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడానికి, జనాభా నియంత్రణకు ప్రభుత్వం కండోమ్ లు, గర్భనిరోధక మాత్రల విక్రయాలను ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో మైనర్లకు వీటిని అమ్మాలంటే ముందుగా మెడికల్ షాపులవాళ్లు వివరాలు అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. దుష్పరిణామాల గురించి వివరించాలి. అంతే కాని వారికి అమ్మకూడదని ఎక్కడా నిబంధనలు లేవు.
ఇదే విషయాన్ని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పిల్లలకు కౌన్సెలింగి ఇవ్వాలే కానీ, వాటిని అమ్మకుండా నిషేధం మాత్రం లేదని తేల్చి చెప్పింది ప్రభుత్వం. ఈ క్లారిటీతో అటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మద్యం కూడా మైనర్లకు అమ్మకూడదనే నిబంధన చాలా రాష్ట్రాల్లో ఉంది. కానీ ఎవరూ దాన్ని పాటించరు. ఇప్పుడు ఇది కూడా అంతే.
నిబంధన ఉన్నా లేకపోయినా మెడికల్ షాపులవాళ్లు తమ లాభాలకోసం పిల్లలు అడిగిన వెంటనే వారికి కావాల్సినవి తెచ్చి చేతిలో పెడతారు, నిబంధను ఉంటే బ్లాక్ లో అమ్ముతారు, లేకపోతే ఎమ్మార్పీ ధరలకే ఇచ్చేస్తారు. అదే తేడా.