సెల్ టవర్ దొంగలు వచ్చేస్తున్నారు జాగ్రత్త..

మీ ఇంటిపై స్థలాన్ని సెల్ టవర్ కోసం అద్దెకు ఇచ్చారా..? ఆ సెల్ టవర్ టెక్నీషియన్లు అంటూ ఎవరైనా వచ్చి అప్పుడప్పుడు చెక్ చేసుకుని వెళ్తున్నారా..? వారిలో దొంగలు ఉన్నారేమో ఓసారి చెక్ చేసుకోండి.…

మీ ఇంటిపై స్థలాన్ని సెల్ టవర్ కోసం అద్దెకు ఇచ్చారా..? ఆ సెల్ టవర్ టెక్నీషియన్లు అంటూ ఎవరైనా వచ్చి అప్పుడప్పుడు చెక్ చేసుకుని వెళ్తున్నారా..? వారిలో దొంగలు ఉన్నారేమో ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సెల్ టవర్ టెక్నీషియన్లు అనే పేరుతో దొంగలు చొరబడుతున్నారు. ఏకంగా టవర్లే ఊడదీసుకుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు బీహార్ లో సంచలనంగా మారింది.

నెలరోజుల క్రితం బీహార్ లో 19 లక్షల విలువైన సెల్ టవర్ దొంగతనం జరిగింది. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ ని దొంగలు బోల్టులు ఈడదీసుకుని ప్యాక్ చేసుకుని వెళ్లిపోయారు. సెక్యూరిటీ లేని అలాంటి ప్రాంతాల్లో దొంగతనాలు సహజమే. అయితే లేటెస్ట్ గా జరిగిన దొంగతనం ఊరి నడిబొడ్డున జరిగింది. 

పాట్నాలోని సబ్జీబాగ్ ప్రాంతంలో ఓ ఇంటిపై ఉన్న 19 అడుగుల సెల్ టవర్ దొంగలు తీసుకెళ్లారు. ఇంటి యజమానితో తాము సదరు కంపెనీ ప్రతినిధులం అని చెప్పారు. టవర్ కు మరమ్మతులు చేయాలని చెప్పి ఓనర్ పర్మిషన్ తీసుకుని మరీ వారు లోపలికి వెల్లారు. అయితే ఆ తర్వాత ఓనర్ వారి విషయం పట్టించుకోలేదు. కొన్నిరోజుల తర్వాత అసలు టెక్నీషియన్లు వచ్చారు. 5జి సిగ్నల్స్ కోసం సెల్ టవర్ కి కొత్త ఎక్విప్ మెంట్ బిగించాలని ఇంటి ఓనర్ తో మాట్లాడి పైకి వెళ్లారు. అక్కడ టవర్ లేకపోవడం చూసి ఖంగు తిన్నారు. విషయం ఆరా తీస్తే.. కొన్నిరోజుల ముందు సెల్ టవర్ రిపేర్ కోసం కొంతమంది వచ్చారని ఓనర్ చెప్పాడు. వారే దొంగలు అయి ఉంటారనే అనుమానంతో పోలీస్ కేసు పెట్టారు. ఆ సెల్ టవర్ ఖరీదు 8.32లక్షల రూపాయలని తేల్చారు.

బీహార్ లో అది ఇది లేదు అన్నీ కాజేస్తారు..

ఆమధ్య బీహార్ లో రైలింజన్ ని కాజేశారు దొంగలు. బరౌనీ గర్హారా యార్డ్ లో ఓ డీజిల్ ఇంజిన్ ని మరమ్మతులకోసం తెప్పించారు. ఆ యార్డ్ పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ నుంచి భూమిలోకి సొరంగంలా తవ్వి డీజిల్ ఇంజిన్ ని పార్ట్ పార్ట్ లు గా ఊడదీసి దొంగతనం చేసుకెళ్లారు.

గతేడాది బీహార్ లోనే 60 అడుగుల పొడవున్న ఓ ఇనుప బ్రిడ్జిని ఇలాగే దొంగలు ఎత్తుకెళ్లారు. పక్కనే కాంక్రీట్ బ్రిడ్జ్ కట్టడంతో గ్రామస్తులు పాత బ్రిడ్జ్ వైపు వెళ్లడం మానేశారు. ఆ తర్వాత ఓ గ్యాంగ్ పాత బ్రిడ్జ్ ని మెల్లగా ఊడదీసుకుని వెళ్లిపోయింది. 3రోజుల్లో ఈ దొంగతనం పూర్తి చేశారు. చివరకు ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆరా తీస్తే బ్రిడ్జ్ ని దొంగలు ఎత్తుకెళ్లారని తేలింది. బీహార్ దొంగలు మామూలోళ్లు కాదు. ఇప్పుడు సెల్ టవర్లపై పడ్డారు.