సినిమా బిజినెస్ ఓపెన్ అయ్యిందా?

సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ఎగ్జిబిషన్ వ్యవస్థ అంత గజిబిజి వ్యవహారం మరోటి లేదు. థియేటర్ రెట్లు, డెఫిసిట్ లు, మార్జిన్లు, ఇలా సవాలక్ష వ్యవహారాలు, సవా లక్ష పదజాలం వుంటుంది. ఏదీ ఒక లెక్కలో…

సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ఎగ్జిబిషన్ వ్యవస్థ అంత గజిబిజి వ్యవహారం మరోటి లేదు. థియేటర్ రెట్లు, డెఫిసిట్ లు, మార్జిన్లు, ఇలా సవాలక్ష వ్యవహారాలు, సవా లక్ష పదజాలం వుంటుంది. ఏదీ ఒక లెక్కలో వుండదు. ఏదీ ఫిక్స్ డ్ గా వుండదు. ఈవారం వున్న రెంట్ వచ్చేవారం మారిపోవచ్చు. ఇష్టం వుంటే సినిమా వేసుకోండి లేదంటే లేదు అనొచ్చు. బాగా ఆడుతున్న సినిమాను తీసేయలేక అడిగినంత రెంట్ ఇవ్వాల్సి వుంటుంది. ఇలాంటి పరిస్థితి వన్ వీక్ అగ్రిమెంట్ చేసుకుంటే వస్తుంది. ఎక్కువ వారాలు చేసుకుంటే అది వేరే వ్యవహారం. పైగా బ్లాక్ ఎంత వైట్ ఎంత? అది కూడా రిటన్ గా కమిట్ మెంట్ వుండదు.

ఇన్నాళ్లు నైజాంలో అసలు సినిమా థియేటర్ల వ్యవహారం ఎలా వుంటుంది..ఎంత వుంటుంది అన్నది సినిమా జ‌నాలు ఎవ్వరికీ పూర్తి క్లారిటీ లేదు. సురేష్ బాబు/ఆసియన్ సునీల్ చేతుల్లో వందకు పైగా థియేటర్లు వున్నాయి. దిల్ రాజు దగ్గర కొద్దిగా వున్నాయి. ఇండివిడ్యువల్ గా చాలా వున్నాయి. సినిమాలు వస్తున్నాయి హిట్ అవుతున్నాయి. కానీ అసలు లెక్కలు సరిగ్గా బయటకు రావడం లేదన్న గుసగుసలు వున్నాయి.

రెండు మూడేళ్ల క్రితం సంక్రాంతికి ఓ బ్లాక్ బస్టర్ విడుదలైతే అందులో రెండు కోట్లకు పైగా లెక్కల్లో మాయం అయిందన్న టాక్ వుంది. కానీ నిర్మాత ఏమీ చేయలేని పరిస్థితి. నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ పెట్టడం తప్ప కొనము అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్నారై కూడా ఎంత అంటే అంతే తప్ప అదనంగా ఇచ్చేది లేదు.

ఇలాంటి నేపథ్యంలో సీడెడ్ కు చెందిన శశి నైజాంలో మైత్రీతో కలిసి పంపిణీ ఆఫీసు ప్రారంభించారు. సంక్రాంతి విడుదలలు దగ్గర పడుతున్నా తన దగ్గర వున్న వాల్తేర్ వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాల విషయంలో వెనక్కు తగ్గలేదు. తన పద్దతుల ప్రకారమే, తనకు నచ్చినట్లు థియేటర్లు ఇవ్వాలి కానీ ఎగ్జిబిట‌ర్లకు నచ్చినట్లు కాదని మొండికేసుకుని కూర్చున్నారు. తన ఆఫీసు వస్తోందని తెలిసి రెంట్లు అడ్డగోలుగా పెంచేస్తే సహించేది లేదని, సర్కారు వారి పాట టైమ్ లో ఏ రెంట్లు వున్నాయో అవే రెంట్లకు ఇవ్వాలని పట్టు పట్టారు.

పైగా ఇప్పుడు నైజాంలో థియేటర్ల సంగతేమిటి? రెంట్ల ఏమిటి? ఫుల్స్ ఏమిటి? థియేటర్ మార్జిన్లు అంటూ లాగుతున్నది ఏమిటి? ఇలాంటి లెక్కలు అన్నీ మైత్రీ స్వంతంగా కంపెనీ పెట్టడం వల్ల ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కేవలం చిన్న పంతానికి, ఇగో కి పోయి, మైత్రీ లాంటి సంస్థను దిల్ రాజు దూరం చేసుకున్నారు. దాని పుణ్యమా అని నైజాంలో అసలు లెక్కలు అన్నీ తెలుస్తున్నాయి. సినిమా మినిమమ్ వుంటే ఎంత చేస్తుంది. ఎంత ఎన్నారై తీసుకోవచ్చు అన్నది తెలుస్తోంది.

ఇప్పటి వరకు నైజాంలో దిల్ రాజు/ఆసియన్ సునీల్ ముందు ఎవ్వరూ చాలా లేకపోయారు. వరంగల్ శ్రీను, సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్ ఇలా ఎవ్వరూ నిలబడలేదు. వాళ్ల బ్యాడ్ లక్ ఏమిటంటే సరైన సినిమాలు కూడా పడలేదు. కానీ ఇప్పుడు శశి రెండు పెద్ద హిట్ లతో రంగంలోకి దిగారు. ప్రారంభంలోనే కనీసం పది కోట్ల లాభం కళ్ల చూడబొతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు శశి అంటే మైత్రీ డిస్ట్రిబ్యూషన్ వైపు చూస్తున్నారు.

వైజాగ్ లో కూడా

నైజాంతో సమానమైన బిజినెస్ చేస్తున్న వైజాగ్ లో కూడా దిల్ రాజు కు పోటీగా బలమైన పంపిణీ సంస్థలు తయారయ్యాయి. గాయత్రి సతీష్, వీర్రాజు వంటి వారు సక్సెస్ ఫుల్ గా సినిమాలు పంపిణీ చేస్తున్నారు. పండగకు రెండు పెద్ద సినిమాలు బలంగా హ్యాండిల్ చేసి గాయత్రి సతీష్ శభాష్ అనిపించుకున్నారు. తన సినిమా వుందని ప్రారంభంలో థియేటర్ల విషయంలో ముందుకు రాని దిల్ రాజు టీమ్ కూడా తప్పని సరిగా ఇటే రావాల్సి వచ్చింది.

సితార, మైత్రీ, స్వప్న సినిమాస్, పీపుల్స్ మీడియా, ఇలా బలమైన సంస్థలు అన్నీ వైజాగ్ లో దిల్ రాజు కు దూరం అయ్యాయి. అవుతున్నాయి. దీని వల్ల అసలు బిజినెస్ ఎలా వుంటుంది..ఏం జ‌రుగుతోంది అన్నది క్లారిటీ వస్తోంది.

అయినా దిల్ రాజే అన్నారు. అందరికీ తెలిసి వస్తుంది. అలా తెలిసి రావడం అన్నది పాజిటివ్ గానా? నెగిటివ్ గానా అన్నది మరో కొన్ని సినిమాలతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.