'సీబీఐ చిటికేస్తే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి?' అంటూ తెలుగుదేశం నేత దేవినేని ఉమ ప్రశ్నించి కొన్ని గంటలు అయినా కాలేదు, ఇంతలోనే చంద్రబాబు నాయుడు మీద పాత స్టే ఒకటి తొలగిపోయింది. పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కేసులో స్టే కొనసాగుతూ వచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెలలోనే అని ఏసీబీ కోర్టు ప్రకటించింది.
అయితే ఈ చిటికెలు వేయడం ఇంతటితో ఆగుతుందా? అనేది ఆసక్తిదాయకమైన చర్చ. ఒకటా రెండా.. చంద్రబాబు నాయుడు చాలా కేసుల్లో స్టేల మీద కొనసాగుతూ ఉన్నారు. దాదాపు 18 కేసుల్లో చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకుని 'నిప్పు'గా చలామణి అవుతున్నారని భోగట్టా. ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఎవరు చిటికెలు వేస్తారో,ఇంకా ఎక్కడ స్టేలు రద్దు అవుతాయో అనేది చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు నాయుడు అక్రమాస్తులు కూడబెట్టారంటూ కేసులు ఫైల్ చేసిన వారు చాలా మందే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా కూలంకషంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను కోర్టు విచారణకే తీసుకోలేదు!
జగన్ మీద ఆయన రాజకీయ ప్రత్యర్తులు చిత్తు కాగితాల్లో ఫిర్యాదులు ఇస్తే సీబీఐ విచారణ వరకూ వెళ్లింది వ్యవహారం. అదే చంద్రబాబు మీద పిటిషన్ దాఖలు అయితే దానికి విచారణ అర్హతే లేదంటూ, అది రాజకీయ ప్రత్యర్థుల పనంటూ దాన్ని విచారణకు అప్పట్లో తీసుకోలేదు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. చిటికెలు వేస్తేనే కథలు మారిపోతాయని తెలుగుదేశం వాళ్లే అంటున్నారు. ఇప్పుడు ఇంతకూ ఎవరు చిటికేశారో తెలుగుదేశం వాళ్లే చెప్పాలి!