ధైర్యే సాహసే లక్ష్మీ అన్నది పెద్దల మాట. రిస్ట్ లేకపోతే రస్క్ కూడా మిగలదు అన్నది కుర్రకారు ట్యాగ్ లైన్. టాలీవుడ్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడే నిర్మాతలు వున్నారు. రిస్క్ చేసే నిర్మాతలు వున్నారు. రిస్క్ చేసే వారిని చూసి సేఫ్ గేమ్ ఆడేవారు డైలమాలో పడుతూనే వుంటారు. ఇది సరైన దారినా? కాదా? అని. మూవీ మొగల్ అనిపించుకున్న రామానాయుడు విపరీతమైన రిస్క్ లు చేసారు. వాటిలో బ్లాక్ బస్టర్లు వున్నాయి. అట్టర్ ఫ్లాపులూ వున్నాయి. కానీ, ఆయన కొడుకు సురేష్ బాబు పక్కా సేఫ్ గేమ్ తప్ప, రిస్క్ అనే దానికి కిలోమీటర్ దూరంలో వుంటారు.
ఇప్పుడు అసలు ఎందుకీ డిస్కషన్ అంటే..ఇటీవల హిట్ అయిన మూడు సినిమాలు చూసిన తరువాత టాలీవుడ్ నిర్మాతల్లో మళ్లీ ఇదే పాయింట్ మీద ఆలోచన మొదలయింది. కార్తికేయ 2, ధమాకా..వాల్తేర్ వీరయ్య…వీర సింహా రెడ్డి. ఈ మూడు సినిమాలు విడుదలకు ముందు సరైన టాక్ అయితే లేదు. అది వాస్తవం. ఓవర్ బడ్జెట్ కావడం, ఎడిటింగ్ టేబుళ్ల మీద నుంచో, పోస్ట్ ప్రొడక్షన్ నుంచో బయటకు వచ్చే టాక్ పాజిటివ్ గా లేకపోవడం వంటి వ్యవహారాలు వున్నాయి. విడుదలకు ముందు కేవలం కాంబినేషన్ సినిమాలే తప్ప, విషయం వున్న సినిమాలు కాదు అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో వుంది. విడుదలయిన తరువాత ఈ మూడు సినిమాలకు సరైన పాజిటివ్ పీడ్ బ్యాక్ లేదు. హండ్రెండ్ పర్సంట్ పాజిటివ్ రివ్యూలు లేవు.
కానీ జనం ఆదరించేసారు. వంద కోట్ల క్లబ్ లోకి తోసేసారు ఈ నాలుగు సినిమాలను. మైత్రీ మూవీస్ సంస్థ కేవలం కాంబినేషన్లను నమ్మి, దర్శకులకు వదిలేసి సినిమా తీసారు. పీపుల్స్ మీడియా సంస్థ కూడా అంతే. దిగిన తరువాత వెనక్కు తగ్గకుండా ఎంత అయితే అంతా ఖర్చు చేసారు. వాళ్లు కూడా దర్శకులనే నమ్మారు. రెండు సంస్థలకు మంచి ఫలితాలు వచ్చాయి.
నిజానికి ఇది నూటికి నూరు శాతం రిస్క్. పేకాట భాష ప్రకారం ఎసి డిసి ఆడడమే. విడివిడిగా వచ్చి వుంటే బాలయ్య, చిరు సినిమాల పరిస్థితి ఏమై వుండేది అనే డిస్కషన్ ఇప్పటికీ సాగుతోంది. సంక్రాంతికి కాకపోయి వుంటే బాలయ్య సినిమా రేంజ్ ఏమిటి అనే లెక్కలు ఇప్పటికీ కడుతున్నారు. ధమాకా లో శ్రీలీల..పల్సర్ బండి పాట సరైన టైమ్ లో రావడం వంటివి లేకపోయి వుంటే ఏమై వుండేది అనే రీజన్లు పీకుతున్నారు. కార్తికేయ 2 లో కృష్ణ భక్తి, అనుపమ్ ఖేర్ ఎపిసోడ్ ఆదుకున్నాయంటున్నారు.
కారణాలు ఏమైనా, ఈ నాలుగు సినిమాల నిర్మాతలు చేసింది రిస్క్ నే. అదే వారికి కోట్లు తెచ్చి పెట్టింది. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది పెద్ద నిర్మాతలు ఇదే ఆలోచిస్తున్నారు. ఇదే సరైన దారి అనుకోవాలా? అవి హిట్ కావడాన్ని ఆదర్శంగా తీసుకుని వాటి దారిలోనే వెళ్లాలా? అన్న విషయంలో కిందా మీదా అవుతున్నారు. అదృష్టం కలిసి వస్తే రిస్క్ బాగుంటుంది. లేదంటే రిస్క్ బాగుండదు. పీపుల్స్ మీడియా, మైత్రీ అదృష్టం బాగుంది. రిస్క్ కలిసి వచ్చింది. అన్నిసార్లు, అందరికీ అలా కలిసిరాదు అని మరి కొందరు సర్ది చెప్పుకుంటున్నారు.