టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధోరణిపై బీసీలు మండిపడుతున్నారు. తరతరాలు నారా కుటుంబానికి ఊడిగం చేస్తామని తమ తరపున చెప్పడానికి బీసీలు నిలదీస్తున్నారు. మరీ ఇంత బానిసత్వ భావజాలమా? సామాజిక చైతన్యం, కుల ఆత్మగౌరవం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేవాన్ష్‌కు కూడా తమ మూడో తరం బానిసగా వుంటుందని బుద్దా ప్రకటించడంపై బీసీలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఒకప్పుడు టీడీపీకి బీసీలు అండగా నిలిచారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాత బీసీ కోటను బద్దలు కొట్టారు. వారిలో భారీ చీలిక తెచ్చి వైసీపీ వైపు తిప్పుకున్నారు. దీంతో ఒక్క కమ్మ సామాజిక వర్గం తప్ప, ఇతరులు టీడీపీకి నమ్మకమైన ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీసీలను తమ వైపు తిప్పుకుంటే తప్ప అధికారంలోకి రాలేమనే భయం టీడీపీ నేతల్లో నెలకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో భారీ బీసీ సభలను నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకు బీసీ నేతలకు బాధ్యతలు అప్పగించారు.
బీసీ సభలపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వివరాలు వెల్లడించే క్రమంలో… తాము (బీసీలు) చంద్రబాబుతోనే వుంటామన్నారు. తమ తర్వాతి తరం లోకేశ్‌తో, మూడో తరం దేవాన్ష్‌తోనే వుంటామని భావోద్వేగంతో చెప్పారు. అంటే తరతరాలుగా నారా కుటుంబానికి బీసీలు ఊడిగం చేస్తూనే ఉంటామని బీసీల తరపున వకల్తా పుచ్చుకుని బుద్దా చెప్పారన్న మాట. ఇంతకంటే భావదారిద్ర్యం మరేదైనా వుంటుందా? అని బీసీలు ప్రశ్నిస్తున్నారు.
రాజ్యాధికారం కోసం దేశ వ్యాప్తంగా బీసీలు పోరాడుతుంటే, బుద్దా మాత్రం తమ తర్వాతి తరం కూడా చంద్రబాబు కుటుంబానికే సేవలు చేసేందుకు సిద్ధమని ఆరాటంతో చెప్పడం ఏంటని ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే బీసీలకు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. బీసీలకు చేసిన నష్టం చాలని, ఇకనైనా ఊడిగం మాని ఆత్మాభిమానంతో బతకడం నేర్చుకోవాలని బీసీలు హితవు చెబుతున్నారు.